BRS Leader Errabelli Dayakar Rao: పాలకుర్తి: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిచెందిన మంత్రులలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఒకరు. కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లిపై విజయం సాధించారని తెలిసిందే. ఎమ్మెల్యేగా ఓటమి తర్వాత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మొదటిసారిగా నియోజకవర్గ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఫలితాలపై పాలకుర్తి బిఆర్ఎస్ పార్టీ కుటుంబసభ్యులు ఎవరూ బాధ పడవద్దని, అదైర్యపడొద్దని.పార్టీ నాయకులను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని దయాకర్ రావు అన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న ఎర్రబెల్లి అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ హ్యాట్రిక్ విజయాలు అందుకున్న అతికొద్ది మంది నేతలలో ఒకరు. కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగానూ వ్యవహరించారు.


పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పాలకుర్తి, కొడకండ్ల, పెద్దవంగర, తొర్రూరు, రాయ‌ప‌ర్తి మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. సమావేశంలో ఓటమి, పార్టీ పరిస్థితి పై కార్యకర్తలతో చర్చించారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ.. పాలకుర్తి ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని అన్నారు. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, ప్రజా తీర్పును గౌరవిస్తున్నానని చెప్పారు. అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యల పట్ల పోరాటం కొనసాగిద్దామని కార్యకర్తలకు దయాకర్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  


37 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న మంత్రికి షాక్ ఇచ్చిన 26 ఏళ్ల యువతి యశస్విని రెడ్డి


మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌పై పోటీ అంటే ఆశామాషీ కాదు. 1985 నుంచి ఓటమి అంటూ లేకుండా అప్రహతిహాతంగా సాగిపోతున్న మంత్రిపై పోటీ అంటే హేమాహేమీలకే తడిసిపోతుంది. అలాంటిది రాజకీయాల్లో ముక్కుపచ్చలారని యువతి ఢీ కొట్టారంటే ఎవరైనా నవ్వుతారు. ఆయనకి ఉన్న అనుభవం ముందు ఈమె అసలు సరితూగుతారా కనీసం డిపాజిట్ అయినా దక్కించుకుంటారా అనే అనుమానం అందరికీ కలుగుతుంది. అందరూ అనుకోని సాధిస్తే కదా అద్భుతం అవుతుంది. అలాంటి అద్భుతమైన విజయాన్నే సాధించారు యశస్విని రెడ్డి. 37 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా పని చేసిన ఎర్రబెల్లిని ఓడించి తెలంగాణ రాజకీయాల్లోనే పెను సంచలనంగా మారారు యశస్విని రెడ్డి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి