Twitter Logo Change:
మస్క్ మామ ఆటలు..
ఎలన్ మస్క్‌కు ఏమైంది? ఎందుకిలా చేస్తున్నారు? సోషల్ మీడియాలో ఇదే డిస్కషన్. ఈ మధ్యే ఆయన తీసుకున్న నిర్ణయం అలాంటిది మరి. ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఏదో ఓ సెన్సేషనల్ నిర్ణయాలు తీసుకుంటున్నారు మస్క్. ఇటీవల ఏకంగా ట్విటర్ లోగోనే మార్చేశారు. పిట్ట స్థానంలో కుక్కను పెట్టారు. అంతర్జాతీయంగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇదేం డీపీరా బాబు అని అందరూ ఆశ్చర్యపోయారు. మస్క్ మామకు ఏమవుతోంది..? అంటూ కామెంట్లు పెట్టారు. మస్క్‌కు మళ్లీ ఏమైందో ఏమో. ట్విటర్ లోగో మరోసారి మార్చారు. పాత లోగోనే మళ్లీ పెట్టారు. వెబ్‌వర్షన్‌లో కుక్క స్థానంలో పిట్ట వచ్చి చేరింది. ట్విటర్ మొబైల్ యాప్‌లోనూ లోగో మారిపోయింది. సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ట్విటర్ లోగో అప్‌డేట్ అయిందంటూ అందరూ పోస్ట్‌లు పెడుతున్నారు. కొందరు స్క్రీన్‌షాట్‌లు తీసి మరీ షేర్ చేస్తున్నారు. "లోగో మార్చి మూడు రోజులే అయింది. మళ్లీ ఎందుకు మార్చారు. అయినా నాకు డాగ్ లోగోనే నచ్చింది" అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంకొందరు మాత్రం "హమ్మయ్య మళ్లీ పాత లోగో వచ్చేసింది" అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి...డాగ్ లోగోపై విమర్శలు వచ్చాయి. మస్క్ ఎందుకిలా చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. ఇదంతా కేవలం అటెన్షన్ కోసం చేస్తున్నదే, లోగో ఏదైతే ఏముంది..? అని మరి కొందరు మండి పడుతున్నారు.
అయితే...ఎలన్ మస్క్ ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. మార్చి 26న ఓ ట్విటర్ యూజర్‌తో జరిగిన కన్వర్జేషన్‌ని షేర్ చేశారు. "ట్విటర్‌ను కొనేయండి. బర్డ్ లోగోను తీసేసి డాగ్ లోగో పెట్టండి" అని ఆ యూజర్ మస్క్‌కు సూచించాడు. అందుకు మస్క్ ఒప్పుకున్నాడు. అదే స్క్రీన్‌షాట్‌ని షేర్ చేసిన మస్క్ "ప్రామిస్ చేసినట్టే మార్చేశా" అని ట్వీట్ చేశారు.