కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధినాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాను ఎప్పుడూ కాంగ్రెస్ వీడుతానని అనుకోలేదన్నారు. కాంగ్రెస్ చేసిన పొరపాటు నిర్ణయాలు కారణంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిందన్నారు కిరణ్‌కుమార్ రెడ్డి. దాని వల్ల ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పూర్తిగా నాశనమైందని అభిప్రాయపడ్డారు. కనీసం రాష్ట్రంలో ఎవర్నీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. విభజన కోసం ఎవర్ని నియమించారో వాళ్లెవరూ తమతో మాట్లాడలేదన్నారు. పట్టించుకోలేదని ఆరోపించారు. 


2019 నాటికి కాంగ్రెస్‌ ఎంత నష్టపోయిందో.. బీజేపీ అంతకు మించి బలపడిందన్నారు కిరణ్‌కుమార్‌ రెడ్డి. జబ్బును కనిపెట్టి దానికి మందు వేయాలనే ఆలోచన కాంగ్రెస్ ఎప్పుడూ చేయలేదన్నారు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం కూడా చేయలేకపోయిందని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో బలహీనపడుతూ నాశనమయ్యే స్థితికి వచ్చిందని కామెంట్ చేశారు. 






దేశాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే బీజేపీ పని చేస్తుందన్నారు కిరణ్‌కుమార్ రెడ్డి. ఆ విషయంలో బీజేపీ నేతలందరిలో కనిపిస్తోందని అన్నారు. మోదీ, అమిత్‌షా సహా బీజేపీ అధినాయకత్వం డైరెక్షన్ చాలా బాగుందని కితాబు ఇచ్చారు. నిర్ణయాలు తీసుకోవడంలో సమర్థత కనిపిస్తోందని అన్నారు. గెలవాలనే తపన, దూరదృష్టి బీజేపీలో మాత్రమే కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. 


కాంగ్రెస్‌ అతి విశ్వాసంతో తీసుకున్న నిర్ణయాల వల్లే దేశవ్యాప్తంగా పార్టీ ఓటమి పాలవుతూ వస్తోందన్నారు కిరణ్‌ కుమార్ రెడ్డి. అధినాయకత్వం చెప్పిందే వేదం అంటారే కానీ... కింది స్థాయిలో ఏం జరుగుతుందో పట్టించుకునే వాళ్లు ఒక్కరూ లేరని ఎద్దేవా చేశారు. నేతల, పార్టీ శ్రేణుల అభిప్రాయంతో పని లేకుండా నిర్ణయాలు తీసుకుంటారని అందుకే కాంగ్రెస్ క్షీణదశకు చేరిందని విమర్శించారు. 


అంతకు ముందు మాట్లాడిన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి.. కిరణ్‌కుమార్ రెడ్డి కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారని అన్నారు. ఎంతో గొప్ప పొలిటికల్‌ హిస్టరీ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన కిరణ్‌ కుమార్‌రెడ్డి బీజపీలో చేరడం చాలా ఆనందించదగ్గ విషయమన్నారు ప్రహ్లాద్ జోషి. ఆయన రాకతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పార్టీకి మరింత బూస్టప్ వచ్చినట్టు అవుతుందన్నారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు ప్రహ్లాద్ జోషి. స్వతహాగా క్రికెటర్ అయిన కిరణ్‌ కుమార్ రెడ్డి ఇప్పుడు ఇన్నింగ్స్ ప్రారంభించారని... ఇకపై ఏపీలో బ్యాటింగ్‌ జోరందుకుంటుందని అన్నారు.