Ex New Zealand PM:


పార్లమెంట్‌లో ప్రసంగం..


న్యూజిలాండ్‌ మాజీ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఈ ఏడాది జనవరిలో తన పదవికి రాజీనామా చేసి అందరినీ షాక్‌కు గురి చేశారు. చాలా అద్భుతంగా పాలించారంటూ ప్రశంసలు అందుకున్న ఆమె ఉన్నట్టుండి రాజకీయాల నుంచి తప్పుకోవడం ఆశ్చర్యపరిచింది. కరోనా సంక్షోభ సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయాలపై అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కాయి. అయితే...కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నాన్న కారణంతో ఆమె రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. మాతృత్వాన్ని ఆస్వాదించలేకపోతున్నానంటూ కొన్ని సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకత్వం వహించాలనుకునే మహిళలకు మాతృత్వం అడ్డుకాకూడదంటూ ఎమోషనల్ అయ్యారు. పార్లమెంట్‌లో మాట్లాడిన ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.  


"ఒకే వ్యక్తి రెండు చోట్ల పూర్తిగా న్యాయం చేయడం సాధ్యం కాదని అనుకోవద్దు. ఈ పదవిలో ఉంటూ మంచి తల్లిని అనిపించుకోవడం పెద్ద కష్టంగా అనిపించలేదు. ఇన్నేళ్లలో దేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అలాంటి భయంకర పరిస్థితులనూ దాటుకుని వచ్చాం. కానీ ఈ సవాళ్లే మన శక్తేంటో తెలియజేశాయి. వాటిని ఎలా ఎదుర్కోగలమో చెప్పాయి."


- జెసిండా ఆర్డెర్న్, న్యూజిలాండ్ మాజీ ప్రధాని 


టార్చ్ బేరర్..


2018లో న్యూజిలాండ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే జెసిండా కూతురికి జన్మనిచ్చారు. అలా పదవిలో ఉండి బిడ్డకు జన్మనిచ్చిన రెండో మహిళగా రికార్డు సృష్టించారు. ఓ సారి న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సమావేశం జరగ్గా...ఆ సమయంలో బిడ్డను తన భర్త వద్ద ఉంచి హాజరయ్యారు జెసిండా. అప్పట్లో ఈ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. రెండు సార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన జెసిండా...క్రైసిస్ మేనేజర్‌ బిరుదు సంపాదించుకున్నారు. ఐదేళ్ల పాలనలో ఎన్ని సవాళ్లు ఎదురైనా చాలా గట్టిగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో చాలా చాకచక్యంగా వ్యవహించారు. 2019లో రెండు మసీదులపై ఉగ్రదాడులు జరిగాయి. 51 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరవాత తుపాను వచ్చి 22 మంది మృతి చెందారు. వెంటనే కొవిడ్ దాడి చేసింది. వీటన్నింటినీ ఎంతో సమర్థంగా ఎదుర్కొన్నారు జెసిండా. ప్రపంచ వేదికపై న్యూజిలాండ్‌ను గొప్పగా నిలబెట్టారు. అందుకే ఆమెను న్యూజిలాండ్ ప్రజలు టార్చ్ బేరర్ అని పిలుచుకుంటారు. చివరిసారి పార్లమెంట్‌లో ప్రసంగించిన ఆమె...వాతావరణ మార్పులపైనా ప్రస్తావించారు. 


"వాతావరణ మార్పులకు మించిన పెద్ద సంక్షోభం లేదు. ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ సభా వేదికగా అందరికీ నేను చెప్పేదొక్కటే. వాతావరణ మార్పుల విషయంలో మాత్రం రాజకీయాలు చేయకండి" 


- జెసిండా ఆర్డెర్న్, న్యూజిలాండ్ మాజీ ప్రధాని 



మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన జెసిండా ఆర్డెర్న్ నార్త్ ఐల్యాండ్ హింటర్ ల్యాండ్ లో పెరిగారు. ఆమె తండ్రి పోలీసుగా పని చేస్తుండేవారు. కమ్యూనికేషన్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. బ్రిటన్ లోని బ్లయర్ ప్రభుత్వంలో పాలసీ అడ్వయిజర్ గానూ గతంలో జెసిండా పని చేశారు. అంతకు ముందు న్యూజిలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లర్స్ కార్యాలయంలో విధులు నిర్వర్తించారు. 2008లో పార్లమెంట్ మెంబర్ గా జెసిండా ఎన్నికయ్యారు. 2017లో లేబర్ పార్టీ డిప్యూటీ లీడర్ గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ద్రవ్యోల్బణం, మాంద్యం పరిస్థితులను ఎదుర్కుంటోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ, వ్యక్తిగత ప్రజాదరణ పడిపోయినట్లు వెల్లడి అయింది. 


Also Read: Amritpal Singh: పోలీసుల సెలవులు రద్దు చేసిన ప్రభుత్వం, అప్పటి వరకూ డ్యూటీలోనే ఉండాలని కండీషన్