Elon Musk is going to provide internet service called Star Link in India: ఇంటర్నెట్ లేని జీవితాన్ని ఇప్పుడు ఊహించడం కష్టం. ఆక్సీజన్ లేకపోయినా బతకవచ్చు కానీ వైఫై లేదా మొబైల్ నెట్ కనెక్షన్ లేకపోతే ఊపిరి ఆడదు. అంతగా జీవితంలో కలిసిపోయిన ఇంటర్నెట్ మార్కెట్ ను పూర్తిగా కైవసం చేసుకునేందుకు మన దేశంపైకి ఎలాన్ మస్క్ దండెత్తి వస్తున్నారు. ఆయనకు చెందిన స్టార్ లింక్ కంపెనీ ఇండియాలో సర్వీసులు అందించే ప్రయత్నం చేస్తోంది. ఆ కంపెనీ వస్తే ఇక మన దేశంలో మొబైల్ టవర్లు, ఇంటర్నెట్ కేబుల్స్ మొత్తం స్క్రాప్ గా మారిపోవాల్సిందే. ఎందుకంటే స్టార్ లింక్ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తుంది. పోల్స్..వైర్స్ ఉండవు. 


ఎక్కడైనా ఇంటర్నెట్ అందించే స్టార్ లింక్


భూమ్మీద ఏ మారుమూల ప్రదేశానికి వెళ్లినా, ఆఖరికి నడి సముద్రంలో కూడా ఇంటర్నెట్ పొందగలిగే వెసులుబాటు స్టార్ లింక్ ద్వారా ఎలాన్ మస్క్ కల్పిస్తున్నారు. రష్యా,ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఉక్రెయిన్ ఇంటర్నెట్ లేక ఇబ్బంది పడింది. ఆ సమయంలో ఎలాన్ మస్క్ ఆదుకున్నారు. ఉచితంగా స్టార్ లింక్ ద్వారా ఉక్రెయిన్ మొత్తానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. ముఖ్యంగా సైన్యానికి అవసరమైన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. ఆయన ఇప్పటికే పలు దేశాల్లో ఇలా స్టార్ లింక్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తూ వ్యాపారం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో స్టార్ లింక్ సర్వీసెస్ ఉన్నాయి.  


Also Read:  పాకిస్థాన్‌లో బంగ్లాదేశ్ తరహా అల్లర్లు - రెచ్చిపోతున్న ఇమ్రాన్ సపోర్టర్లు - అధ్యక్షుడు పారిపోవాల్సిందేనా ?


ఇండియాలో అడుగు పెట్టేందుకు చాలా కాలంగా మస్క్ ప్రయత్నాలు


ఇండియాలో ఇంకా స్టార్ లింక్ ఇంటర్నెట్ సర్వీస్ అనేది అందుబాటులో లేదు. మన దేశంలో కూడా ఆ సర్వీసెస్ ప్రవేశపెట్టేందుకు చర్చలు జరుపుతున్నారు.  స్టార్ లింక్ వెబ్ సైట్ లో కూడా ఇండియాలో తమ సర్వీసెస్ త్వరలో వస్తాయని చెబుతోంది. ఈ స్టార్ లింక్ వెబ్ సైట్‌లో ఎలాంటి వైర్స్, పోల్స్ ఉండవు. ఓ చిన్న రిసీవర్ లాంటి డిష్ ఇస్తారు. అది మనం పెట్టుకునే వైఫై రూటర్ అంత ఉంటుంది. దాన్ని స్టార్ లింక్ ఇంటర్నెట్ కిట్ అంటారు.  ఈ చిన్న డిష్ ని ఇంటిపైన పెట్టుకుంటే అది డైరెక్ట్ గా స్టార్ లింక్ శాటిలైట్‌తో కనెక్ట్ అవుతుంది. ఎలాన్ మస్క్ కు స్పేస్ ఎక్స్ అనే కంపెనీ కూడా ఉంది. దాని ద్వారా కావాల్సిన శాటిలైట్లను ఆకాశంలోకి పంపి స్టార్ లింక్ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు.  ప్రస్తుతం  స్టార్‌లింక్ 4,500 శాటిలైట్స్ ని కలిగి ఉంది. ఈ సంఖ్యను పన్నెండు వేలకు పెంచాలని మస్క్ ప్రయత్నిస్తున్నారు. 


Also Read: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు


రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్న మస్క్ 


ఇండియాలో బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు ప్రారంభించడానికి లైసెన్స్‌ పొందాలి. దీనికి భారత్‌లో టెలికాం నిబంధనలకు స్టార్‌ లింక్‌ అంగీకారం తెలుపాల్సి ఉన్నది. దేశంలో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించడానికి టెలికాం సంస్థ సేకరించే డేటాను భద్రతా నియమకాలకు లోబడి భారత్‌లోనే భద్రపరచాలి. అవసరమైన సమయంలో దర్యాప్తు సంస్థలు ఆ డేటాను పొందడానికి వీలు కల్పించాలి. ప్రభుత్వం నుంచి అనుమతులు పొందడానికి ఈ నియమాలు కచ్చితంగా పాటించాలి.  ఇప్పటివరకు ఎటువంటి ఒప్పంద పత్రాన్ని స్టార్‌లింక్‌ సమర్పించలేదు. ఇన్‌-స్సేస్‌కు అనుమతుల కోసం స్టార్‌లింక్‌ దరఖాస్తు చేసింది.  భారత నిబంధనలకు స్టార్‌ లింక్‌ ఒప్పుకోవడంతో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ స్పెక్ట్రమ్‌ కేటాయింపు, వాటి ధరలను ఖరారు చేయడంపై కసరత్తు జరుగుతోంది.  స్టార్‌ లింక్‌కు అన్ని అనుమతులు లభించి దేశీయంగా సేవలు ప్రారంభిస్తే దేశీయ టెలికాం కంపెనీలు తీవ్రమైన పోటీ ఎదుర్కొనే అవకాశం ఉంది.