Electoral Bonds Case: ఎలక్టోరల్ బాండ్స్ కేసులో సుప్రీంకోర్టు మందలించిన తరవాత SBI అప్రమత్తమైంది. ఈ బాండ్స్‌కి సంబంధించిన అన్ని వివరాలనూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘానికి అందించింది. ఇందులో బాండ్స్ సీరియల్ నంబర్స్‌తో సహా కోర్టు అడిగిన వివరాలను జత చేసింది. ఈ సీరియల్ నంబర్స్ ఇవ్వడం వల్ల ఎవరెవరు ఏయే పార్టీలకు ఎంతెంత విరాళం ఇచ్చారో తెలుసుకోవడం సులువు కానుంది. గతంలో సమర్పించిన డేటాలో ఈ నంబర్స్ లేవన్న కారణంగానే సుప్రీంకోర్టు మండి పడింది. ఇప్పుడు ఆ డేటాని అప్‌డేట్ చేసి ఇచ్చింది SBI.ఈ మేరకు అఫిడవిట్‌ని దాఖలు చేసింది.
"సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలను SBI ఎన్నికల సంఘానికి సమర్పించింది. ఇందులో అకౌంట్ నంబర్స్,సీరియల్ నంబర్స్‌తో పాటు KYC వివరాలూ ఉన్నాయి. ఉన్న డేటా అంతా సమర్పించింది"
- SBI అఫిడవిట్
SBI ఇచ్చిన వివరాలన్నింటినీ ఎన్నికల సంఘం తమ వెబ్‌సైట్‌లో పొందు పరచాల్సి ఉంది. గతంలో ఈసీకి బ్యాంక్ రెండు లిస్ట్‌లు సబ్మిట్ చేసింది. ఈ వివరాలను ఎన్నికల సంఘం మార్చి 14వ తేదీన విడుదల చేసింది. మొదటి జాబితాలో విరాళాలు ఇచ్చిన వాళ్ల పేర్లున్నాయి. వీటితో పాటు బాండ్స్ డినామినేషన్స్, ఏ తేదీన వాటిని విక్రయించారు..? లాంటి వివరాలున్నాయి. మరో లిస్ట్‌లో రాజకీయ పార్టీల పేర్లతో పాటు బాండ్స్ డినామినేషన్ల్ డిటెయిల్స్ ఉన్నాయి. అయితే...యునిక్ నంబర్స్ మాత్రం ఇవ్వలేదు. ఈ నంబర్స్ లేకపోతే ఎవరు ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చారో ఎలా తెలుస్తుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కచ్చితంగా అన్ని వివరాలు సమర్పించాలని ఆదేశించింది. మార్చి 21 సాయంత్రం 5 గంటల లోగా అన్ని వివరాలు ఈసీకి అందజేయాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాల మేరకు SBI ఈసీకి అన్ని వివరాలు ఇచ్చింది. ఆ తరవాత సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.