Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ, ప్రతిపక్షాల మధ్య విమర్శల డోస్‌ పెరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తోంది. అయితే...కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అన్న ప్రశ్నను చాలా రోజులుగా ఎదుర్కొంటోంది కాంగ్రెస్. ఈ విషయంలో సీనియర్ నేత జైరాం రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీకి అయినా ప్రధాని అభ్యర్థిని ప్రకటించడం ముఖ్యం కాదని, ఎన్నికలంటే వ్యక్తుల మధ్య పోటీ అనుకోవడం సరికాదని తేల్చి చెప్పారు. ఇవేమీ అందాల పోటీలు కాదంటూ సెటైర్ వేశారు. పార్టీలు, పార్టీల సిద్ధాంతాల మధ్యే ఎన్నికల పోటీ ఉంటుందని వెల్లడించారు. 


"మన దేశంలో ఎన్నికలంటే అందాల పోటీలు కాదు. పార్టీలు, పార్టీల సిద్ధాంతాలు, ప్రచారాల మధ్య పోటీ ఉంటుంది తప్ప వ్యక్తుల మధ్య కాదు. ప్రధాని అభ్యర్థిని ప్రకటించడం మాత్రమే ఎన్నికలు అనుకోవడం సరికాదు"


- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత


I.N.D.I.A కూటమి తరపున ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపైనా మీడియా జైరాం రమేశ్‌ని ప్రశ్నించింది. దీనికి ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. ఉమ్మడి మేనిఫెస్టో ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే...అందుకు బదులుగా పంచ్ న్యాయ్‌ పేరిట ఓ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నామని వివరించారు. ఇది కేవలం కాంగ్రెస్‌ది మాత్రమే కాదని, అన్ని ప్రతిపక్ష పార్టీలదని వెల్లడించారు. 


"ఇండియా కూటమి తరపున ఉమ్మడి మేనిఫెస్టో లాంటిది ఏమీ లేదు. మేం కేవలం పంచ్ న్యాయ్ ఎజెండాతోనే పని చేస్తున్నాం. ఇది కేవలం కాంగ్రెస్‌కి మాత్రమే చెందింది కాదు. అన్ని పార్టీలది"


- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత 


ప్రధాని మోదీ, అమిత్‌ షా ఇద్దరిపైనా విమర్శలు గుప్పించారు జైరాం రమేశ్. వాళ్లు సొంతగా 370 సీట్లు గెలుచుకునేటట్టైతే మిగతా పార్టీలతో పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. తాను ఒక్కడే భారత్‌కి చాలు అంటూ గతంలో ప్రధాని మోదీ అన్నారని, కానీ ఇప్పుడు BJD,పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడుతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారని మండి పడ్డారు.