EC Slams BJP Congress: కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తీవ్రంగా మందలించింది. కులం, వర్గం, మతం ప్రస్తావనలు తీసుకొచ్చి ప్రచారం చేయడాన్ని తప్పుబట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ ప్రసంగాలపైనా అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారం పేరుతో అలాంటి స్పీచ్‌లు సరికాదని స్పష్టం చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గేకి మార్గదర్శకాలు జారీ చేసింది. మత సహనాన్ని దెబ్బ తీసే విధంగా ఎన్నికల ప్రక్రియను తక్కువ చేసేలా ప్రసంగాలు ఇవ్వడం మంచిది కాదని వెల్లడించింది. ఇప్పటికే రెండు పార్టీలూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి. ఓ పార్టీ నేతలు మరో పార్టీ నేతలపై ఫిర్యాదు చేశారు. ఈ కంప్లెయింట్స్‌ని పరిగణనలోకి తీసుకున్న ఈసీ రెండు పార్టీలకూ అక్షింతలు వేసింది. ఈ విషయంలో పార్టీలు తమను తాము డిఫెండ్ చేసుకున్న తీరునీ తప్పుబట్టింది. నేతలు హుందాతనం పాటించాలని తేల్చి చెప్పింది.
"ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఎప్పటికీ హుందాగానే ప్రవర్తించాలి. సమాజంలోని అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకోవాలి. గొప్ప రాజకీయ నేతల్ని తయారు చేయాలి. క్రమశిక్షణ పాటించకుండా ఇలా వ్యవహరించడం ఏ మాత్రం సరికాదు. అత్యంత కీలకమైన ఎన్నికల ప్రక్రియలో హుందాతనం పాటించాలి. ముఖ్యంగా సీనియర్ నేతలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి"
- ఎన్నికల సంఘం
అధికారంలో ఉన్న పార్టీగా సమాజంలోని సున్నితమైన అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ప్రచారం చేసే విధానాన్ని మార్చుకోవాలని జేపీ నడ్డాకి రాసిన లేఖలో ఈసీ స్పష్టం చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని దృష్టిలో పెట్టుకుని స్టేట్‌మెంట్‌లు ఇవ్వాలని తేల్చి చెప్పింది. రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేయకూడదని మందలించింది. అటు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గేకి కూడా ఇదే విధంగా లేఖ రాసింది. అంతకు ముందు కాంగ్రెస్...ప్రధాని మోదీ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. మంగళసూత్రాలు కూడా కాంగ్రెస్ లాక్కుంటుందని చేసిన కామెంట్స్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. అటు బీజేపీ కూడా కాంగ్రెస్ నేత రాహుల్‌పై కంప్లెయింట్ ఇచ్చింది. ప్రధాని మోదీ ఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం అనే విధంగా వ్యవహరిస్తున్నారని రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది. ఈ రెండు కంప్లెయింట్స్‌ని పరిగణనలోకి తీసుకుని ఇరు పార్టీలకూ అక్షింతలు వేసింది.
Also Read: Porsche Accident Case: పోర్షే యాక్సిడెంట్ కేసు, నిందితుడికి నోటీసులు పంపిన జువైనల్ జస్టిస్ బోర్డ్