Pinnelli Ramakrishna Reddy News: పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్నికల రోజున పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేయడంతో పాటు నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు ఏర్పడేందుకు కారణమయ్యారని ఆయనపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈవీఎం ధ్వంసం చేసిన తాలుకు సీసీటీవీ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఫలితంగా ఏపీ పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఈనెల 20నే కేసు నమోదు చేశారు.


పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డి తెలంగాణలో ఉన్నారని తెలుసుకొని ఏపీ పోలీసులు ప్రత్యేక బృందాలుగా హైదరాబాద్‌కు వచ్చాయి. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కలిసి ఆయన కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా కంది దగ్గర పిన్నెల్లి కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ కారులో ఉన్న పిన్నెల్లి కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి దగ్గరే కారులో మొబైల్ వదిలేసి పిన్నెల్లి సోదరులు పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ గాలింపు చర్యల నేపథ్యంలో పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డిని పోలీసులు ఏ క్షణానైనా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.


అన్ని ఎయిర్ పోర్టులకు అలర్ట్


ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డిపై బుధవారం మధ్యాహ్నం (మే 22) ప్రెస్ మీట్ నిర్వహించారు. పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ లోనూ ఏపీ పోలీసులు వెతుకుతున్నారని.. అన్ని ఎయిర్ పోర్టులను కూడా అలర్ట్ చేసినట్లుగా ఆయన చెప్పారు. పోలింగ్ రోజు ఒక్క మాచర్లలోనే ఏడు ఘటనలు జరిగాయని చెప్పారు. ఘటనలన్నీ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించామని వివరించారు. పోలింగ్‌ రోజున ఏపీ వ్యాప్తంగా 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయ్యాయని చెప్పారు. ఎమ్మెల్యే పగలగొట్టిన ఈవీఎంలోని సమాచారం మొత్తం సేఫ్ గానే ఉందని చెప్పారు. 


ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్‌)కు పోలీసులు అన్ని వివరాలను అందించారని చెప్పారు. 20వ తేదీన రెంటచింతల కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారని.. అందులో 10 సెక్షన్ల కింద ఎమ్మెల్యేపై కేసులు పెట్టినట్లు తెలిపారు. ఆ కేసుల కింద ఆయనకు దాదాపు ఏడేళ్ల దాకా శిక్షలు పడే అవకాశం ఉందని వివరించారు. ఈసీ ఆదేశానుసారం నిన్నటి నుంచి ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఎవర్నీ వదిలే ప్రసక్తి లేదని సీఈవో ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు.