AP Elections 2024 News: ఏపీలో వచ్చే ఎన్నికల కోసం ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియను కూడా ఎన్నికల సంఘం ప్రారంభించింది. సీఈవో ఆదేశాలతో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు ఇప్పటికే డీఈవోలు సేకరిస్తున్నారు. ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని నిన్న సీఈసీ భేటీలో ప్రస్తావన వచ్చింది. దంతో సీఈసీ సూచనలతో జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈవో ఆదేశాలు ఇచ్చారు. రేపు ఉదయం 11 లోగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలివ్వాలని డీఈవోలకు ఆదేశించారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా టీచర్లను ఈసీ నియమించనుంది.


టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వారిలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రహించిన ప్రభుత్వం ఎన్నికల్లో వారు పని చేస్తే తమకు నష్టం ఉంటుందనే భావనతో వారిని దూరంగా ఉంచిందని ఆరోపణలు వచ్చాయి. ఏపీ ఉచిత, నిర్బంధ విద్య (విద్యా హక్కు చట్టం) నియమాలు-2010కి సవరణ చేసి.. వారికి బోధనేతర పనులను అప్పగించవద్దని, విద్యకు సంబంధించిన కార్యకలాపాలకే పరిమితం చేయాలని నిబంధనలు మార్చింది. 


కేంద్రం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం-2009లోని సెక్షన్‌ 27 ప్రకారం జనాభా గణన, విపత్తు సహాయ విధులు, స్థానిక సంస్థలు, రాష్ట్ర శాసనసభలు, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన విధులు మినహా విద్యేతర పనులకు వారిని వినియోగించకూడదు. అయితే సెక్షన్‌-27లోని నిబంధనలకు అనుగుణంగా బోధనేతర పనులు అప్పగించకూడదనే అంశాన్ని బలోపేతం చేసేందుకు సవరణలు తీసుకొచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. టీచర్లను ఎన్నికల విధులకు దూరంగా పెట్టి.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించేందుకు ఈ సవరణ తీసుకొచ్చారనే విమర్శలు వెల్లువెత్తాయి.