CM Jagan : వైఎస్ఆర్‌సీపీలో ఇంచార్జుల మార్పు కసరత్తు కొనసాగుతోంది. టికెట్టు విషయంలో చర్చించేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి పార్టీ నాయకులు క్యూ కడుతున్నారు. తాజాగా పార్టీ పెద్దల నుంచి పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు వచ్చింది. నియోజకవర్గ ఇంఛార్జుల మార్పులపై సీఎం వైఎస్ జగన్ తుది కసరత్తు చేస్తున్నారు. మార్పులు చేసే నియోజకవర్గాల నేతలను పిలిపించి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, జక్కంపూడి రాజా, ప్రసన్న కుమార్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు వచ్చారు. ఎమ్మెల్యేలు కాసు మహేశ్ రెడ్డి, సూళ్ళూరు పేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యలు కూడా వచ్చారు.
సీఎం జగన్‌తో మంత్రి జోగి రమేష్ భేటీ అయ్యారు. సీఎంను కలిసి తన సీటు విషయమై చర్చించినట్లు తెలుస్తోంది. పెడన నియోజకవర్గంపై ఇంకా స్పష్టత రాకపోవడం గమనార్హం. త్వరలోనే ఈ సీటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంకు నరసారావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చారు. నరసారావు పేట లోక్ సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నియామక అంశంపై చర్చించారు. పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సీఎం అపాయింట్ మెంట్ కుదరింది. ఈ క్రమంలో సీఎం జగన్‌తో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. నరసారావు పేట పార్లమెంట్ ఇన్‌ఛార్జి అభ్యర్థి ఎంపికపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థి ఎంపికపై పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు.
సీట్ల కసరత్తులో ప్రకాశం జిల్లా సీట్లపై కసరత్తును సీఎం జగన్ పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీపై వైసీపీ అధిష్ఠానం క్లారిటీ ఇవ్వలేకపోతోంది. నిన్న మాగుంటతో పాటు బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో ఐ ప్యాక్ ప్రతినిధులు సమావేశమయ్యారు. మార్కాపురంతో పాటు గిద్దలూరు, కనిగిరి స్థానాల అభ్యర్థుల ఎంపికపై ఏదీ ఫైనల్ కాలేదు. మూడు రోజులుగా విజయవాడలోనే బాలినేని ఉన్నారు. అలాగే, ప్రకాశం జిల్లాలోని పలు నియోజవర్గాల వైసీపీ నేతలు బాలినేనిని కలుస్తున్నారు. మూడు రోజులుగా సీఎం జగన్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తుండగా అపాయింట్‌మెంట్ దొరకడం లేదు.
ఒంగోలులో 25 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూముల విషయంలో బాలినేని చర్చలు జరుపుతున్నారు. పలుసార్లు ఇదే విషయంపై సీఎం జగన్, ఆయన వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయరెడ్డిని బాలినేని కలిశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తేనే తాను ఒంగోలు నుంచి పోటీ చేస్తానని బాలినేని చెప్పారు. దీనిపై ఎంపీ విజయసాయిరెడ్డితో పలుసార్లు సమావేశమయ్యారు. ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో జగన్‌ను కలవకుండానే బాలినేని హైదరాబాద్ బయలుదేరారు. తనకు ప్రాధాన్యం ఇవ్వకుండా వైవీ సుబ్బారెడ్డి మాటకే ప్రాధాన్యం ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు బాలినేని. సీటుపై అనుమానం ఉండడంతో ఇప్పటికే టీడీపీ నేతలతో మాగుంట సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.