AP Congress  Harsha Kumar :  షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వడంపై  కాంగ్రెస్ లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మాజీ ఎంపీ హర్షకుమార్ ఇంకెవరూ ఏపీలో లేరా అని ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన వై,ఎస్. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వొద్దని హర్షకుమార్ డిమాండ్ చేశారు.  ఆ రాష్ట్రలో నిరాదరణకు గురైన ఆమె ఇక్కడెలా పనిచేయగలరని ప్రశ్నించారు.ఏపీలో కాంగ్రెస్ ను నడిపించే నాయకులు లేరా అని హర్షకుమార్ ప్రశ్నించారు.ఏపీకీ ప్రత్యేక హోదా,విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు పూర్తి, విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, ఇప్పుడు తెలంగాణలో పుట్టానని చెప్పుకునే షర్మిలకు నాయకత్వం ఇస్తే అదంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
       
తన కుమారుడి వివాహ‌ ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి జగన్ ఇంటికి వెళ్ళిన షర్మిలతో అన్న జగన్ అరగంట మంతనాలు జరిపారని, మోడీని నేను చూసుకుంటాను.నువ్వు సోనియాను చూసుకో..ఎవరు అధికారంలోకి వచ్చినా మనం సేఫ్ గా ఉంటామని జగన్ చెప్పారని జనం భావిస్తున్నారని హర్షకుమార్ అన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ అధిష్టానం గమనించాలని కోరారు.2024 ఎన్నికల్లో తాను అమలాపురం నుంచే ఎంపీగా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.                    


దళితుల ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పేందుకు ఫిబ్రవరి 8 న‌ నిర్వహిస్తున్న దళిత సింహ గర్జన సభకు దిశానిర్దేశం చేసేందుకు   12 న  రాష్ట్ర దళిత నాయకులతో బొమ్మూరు బహిరంగ సభ వేదిక వద్ద సన్నాహక సమావేశం ఏర్పాటు చేసినట్లు అమలాపురం మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి.వి.హర్షకుమార్ చెప్పారు.రాజీవ్ గాంధీ కళాశాల‌ సమావేశం హాలులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  జగన్ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న దళిత జాతి జగన్ కు బాసటగా నిలిచిందని కాని వారి ఆశలపై నీళ్ళు చల్లారని విమర్శించారు.      


దళితులను అన్ని రకాలుగా వంచించారని మండిపడ్డారు.అందుకే గద్దెనెక్కించిన దళితులే జగన్ ను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.  దళితులను జగన్ ఏవిధంగా దగా చేశారో దళిత సింహ గర్జన సభలో ప్రజలకు వివరిస్తామని తెలిపారు. సన్నాహక సమావేశానికి ఇదే ఆహ్వానంగా భావించి దళిత నాయకులంతా  సన్నాహక  సమావేశానికి రావాలని కోరారు.               


వైెఎస్ఆర్ తెలంగాణ పార్టీని షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆమె ఏపీలో  రాజకీయం చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇంత వరకూ కాంగ్రెస్ వైపు నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఒకటి , రెండు రోజుల్లో షర్మిల ను ఏపీ పీసీసీ చీఫ్‌గా ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో  మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యతిరేకత వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారుతోంది.