Maharashtra CM: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో పీటముడి పడింది. ముఖ్యమంత్రి పదవి ఎవరికి అన్నదానిపై ఇంకా ఓ అంగీకారానికి రాలేకపోయారు. బీజేపీ పెద్దల ప్రతినిధులు మూడు పార్టీల ముఖ్యనేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అందరి వాదనలు విన్న తర్వాత వారు ఓ నివేదికను హైకమాండ్ కు పంపారు. దీంతో ఓ ఫార్ములాను రెడీ చేశారు.
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ముంబైలో కీలక వ్యాఖ్యలు చేశారు.తన వల్లనే ముఖ్యమంత్రి ఎంపిక ఆలస్యం అవుతుందని అనుకోవద్దని ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని మోదీకి చెప్పానని షిండే ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవిపై తనకు ఆశ లేదన్నారు. సీఎంగా తాను ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉన్నానన్నారు. పోరాటాలు తనకు కొత్త కాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పీఠంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు అంగీకారమేనని బీజేపీ శ్రేణులుఎలా మోదీ మాటలను ఆమోదిస్తాయో తాము కూడా అలా ఆమోదిస్తామని షిండే తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు తన వల్ల ఆలస్యం కావడం లేదన్నారు.
మహాయుతి కూటమిలో బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. శివసేన, ఎన్సీపీలకు బీజేపీకి వచ్చిన దాంట్లో సగం కూడా రాలేదు. అయితే గతంలో షిండే శివసేనను చీల్చి వచ్చిన సమయంలో బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నప్పటికీ షిండేకే ముఖ్యమంత్రి పీఠం ఇచ్చారు. ఎన్నికలకు ముందు కూడా షిండేనే ముఖ్యమంత్రి గా కొనసాగుతారని ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు రాజకీయం మారిపోయింది. బీజేపీ తరపున సీఎంగా ఫడ్నవీస్ ఎంపికవుతారని.. బీజేపీ హైకమాండ్ కూడా దానికే అనుకూలంగా ఉందని చెబుతున్నారు.
Also Read: Kavitha Latest News: రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
సీఎంగా చేసిన షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఖరారు చేయాలనుకుంటున్నారు. అలాగే అజిత్ పవార్ కూడా డిప్యూటీ సీఎంగా ఉంటారని చెబుతున్నారు. ఒక వేళ సీఎంగా చేసిన చోట డిప్యూటీ సీఎంగా ఉండలేకపోతే కేంద్ర కేబినెట్ మంత్రిగా చాన్సిస్తామని బీజేపీ హైకమాండ్ చెప్పినట్లుగా తెలుస్తోంది.ముఖ్యమంత్రి పీఠం ఇవ్వకపోయినా తనకు ఓకే అని షిండే ప్రకటించడంతో నేతలందరి సమక్షంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో గురువారం అమిత్ షా ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర సర్కార్ కొలువుదీరనుంది.