Money Laundering Case: శివసేన పార్టీ నేతలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వరసు షాక్‌లు ఇస్తోంది. తాజాగా మ‌నీ లాండ‌రింగ్ కేసులో శివ‌సేన ఎంపీ భావ‌నా గ‌వాలినికి ఈడీ సమన్లు జారీ చేసింది. మే 5న త‌మ అధికారుల ఎదుట హాజ‌రు కావాల‌ని ఇందులో పేర్కొంది. గ‌తంలో భావ‌నా గ‌వాలిని మూడు సార్లు హాజ‌రు కావాల‌ని ఈడీ కోరినా ఆమె గైర్హాజ‌రయ్యారు.


ఏంటి కేసు?


2021 సెప్టెంబ‌ర్‌లో గ‌వాలి స‌న్నిహితులు స‌యీద్ ఖాన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. గ‌వాలీ ప‌ర్య‌వేక్షిస్తున్న ఎన్‌జీవో ద్వారా కోట్ల రూపాయ‌లు దారిమ‌ళ్లించార‌ని గ‌త ఏడాది నవంబ‌ర‌లో గ‌వాలీపై చార్జిషీట్ దాఖ‌లైంది. గవాలి తల్లి త‌ల్లి శ‌లింతై గ‌వాలీ, ఖాన్‌లు కంపెనీ డైరెక్ట‌ర్లుగా ఉన్నారు. ట్ర‌స్ట్‌ను కంపెనీగా మార్చే క్ర‌మంలో ఫోర్జ‌రీ జ‌రిగింద‌ని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.


నిధుల‌ను దారిమ‌ళ్లించ‌డం, అక్ర‌మాల‌కు పాల్ప‌డేందుకు ఈ కంపెనీని వాడుకున్నార‌ని ఈడీ ఆరోపిస్తోంది. ట్ర‌స్ట్‌లో రూ.17 కోట్ల మేర గ‌వాలీ అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డార‌ని ద‌ర్యాప్తు ఏజెన్సీ అనుమానిస్తోంది. ఈడీ చివ‌రిసారిగా గ‌త ఏడాది న‌వంబ‌ర్ 24న గవాలికి స‌మ‌న్లు జారీ చేసింది. కానీ ఆమె హాజరు కాలేదు.


సంజయ్ రౌత్


ఈ నెల మొదటి వారంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఈడీ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్ సహా ముగ్గురి రూ.11.15 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.


జప్తు చేసిన ఆస్తుల్లో రూ. 9 కోట్లు విలువ చేసే అలీబాగ్‌లోని 8 స్థలాలతో పాటు ముంబయిలోని దాదార్‌ శివారులో ఉన్న రూ. 2 కోట్ల విలువైన ఓ ఫ్లాట్‌ ఉన్నాయి. ముంబయిలోని పత్రచాల్ రీ-డెవలప్‌మెంట్‌కు సంబంధించి రూ.1,034 కోట్ల విలువైన భూ కుంభకోణం కేసులో భాగంగా ఈ జప్తు జరిగినట్టు ఈడీ పేర్కొంది.


అరెస్ట్


ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త ప్రవీణ్ రౌత్​ను ఫిబ్రవరిలోనే అరెస్టు చేసింది ఈడీ. అనంతరం ఛార్జ్​షీట్ కూడా దాఖలు చేసింది. మరో మనీలాండరింగ్ కేసు పీఎంసీ బ్యాంక్​ మోసానికి సంబంధించి సంజయ్ రౌత్ సతీమణి వర్షా రౌత్​ను గతేడాదే ప్రశ్నించింది ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​. ప్రవీణ్​ రౌత్ భార్య మాధురితో వర్షాకు ఉన్న సంబంధాలపై ప్రశ్నలు సంధించింది. 


Also Read: Hanuman Chalisa Row: అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులకు మళ్లీ నిరాశే


Also Read: World’s Most Loyal Employee: 84 ఏళ్లుగా ఒకే కంపెనీలో ఉద్యోగం- నీ ఓపికకు దండం సామీ!