Coloured photographs of candidates on EVMS: భారత ఎన్నికల సంఘం (ECI) ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు) బ్యాలెట్ పేపర్ల రూపకల్పన , ముద్రణకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు ఓటర్లకు మరింత స్పష్టత, సౌలభ్యం కల్పించే లక్ష్యంతో రూపొందించినట్లుగా ఈసీఐ తెలిపింది. ఈ అప్‌గ్రేడ్ చేసిన బ్యాలెట్ పేపర్లు బీహార్ శాసనసభ ఎన్నికల నుంచి అమలులోకి రానున్నాయి. ఎన్నికల సంఘం ప్రకారం, కొత్త బ్యాలెట్ పేపర్లు ఓటర్లకు అభ్యర్థులను సులభంగా గుర్తించేందుకు వీలుగా ఉంటాయి. బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల కలర్ ఫోటోలు చేరుస్తారు. ఫోటో స్థలంలో మూడు-వంతులు అభ్యర్థి ముఖం స్పష్టంగా కనిపించేలా ఉంటుంది, ఇది ఓటర్లకు అభ్యర్థులను గుర్తించడంలో సహాయపడుతుంది. అభ్యర్థుల సీరియల్ నంబర్లు , NOTA ఎంపికను మరింత స్పష్టంగా, ప్రముఖంగా ప్రదర్శిస్తారు. ఇవి అంతర్జాతీయ భారతీయ అంకెల రూపంలో, 30 పాయింట్ల బోల్డ్ ఫాంట్ సైజులో ముద్రిస్తారు. అభ్యర్థుల పేర్లు, NOTA ఎంపిక ఒకే రకమైన ఫాంట్ రకం , సైజులో ముద్రిస్తారు. బ్యాలెట్ పేపర్లు 70 GSM నాణ్యత కలిగిన కాగితంపై ముద్రిస్తారు. శాసనసభ ఎన్నికల కోసం నిర్దిష్ట RGB విలువలతో గులాబీ రంగు కాగితం ఉపయోగిస్తారు.
ఈ మార్పులు గత ఆరు నెలల్లో ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన 28 సంస్కరణలలో భాగంగా చేశారు. ఈ సంస్కరణలు ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడం, ఓటర్లకు సౌలభ్యం కల్పించడం, స్పష్టతను పెంపొందిస్తాయని భావిస్తున్నారు. అభ్యర్థులను సులభంగా గుర్తించే అవకాశం కల్పించడం, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచడం ఈ మార్పుల ఉద్దేశం అని ఎన్నికల సంఘం తెలిపింది..
ఈ కొత్త బ్యాలెట్ పేపర్లు మొదట బీహార్ శాసనసభ ఎన్నికల నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మార్పులు ఓటర్లు తమ ఓటు హక్కును సులభంగా వినియోగించుకోవడానికి దోహదపడతాయని ఎన్నికల సంఘం ఆశిస్తోంది. ఎన్నికల సంఘం గతంలో కూడా ఈవీఎంలలో అభ్యర్థుల ఫోటోలను చేర్చడం వంటి చర్యలు చేపట్టింది. 2021లో, అస్సాంలోని శాసనసభ ఎన్నికల సందర్భంగా, అభ్యర్థుల ఫోటోలను బ్యాలెట్ పేపర్లపై ముద్రించి, ఈవీఎం బ్యాలెట్ యూనిట్‌లపై అతికించే ప్రక్రియను అమలు చేసింది. ఒకే పేరు లేదా సమాన పేర్లతో ఉన్న అభ్యర్థుల మధ్య గందరగోళాన్ని నివారించడానికి తోడ్పడింది. ఈ కొత్త బ్యాలెట్ పేపర్లు ఓటర్లలో, ముఖ్యంగా నిరక్షరాస్యులు, వృద్ధులలో స్పష్టతను పెంచుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రంగు ఫోటోలు , ద్ద ఫాంట్ సైజు ఓటర్లకు అభ్యర్థులను సులభంగా గుర్తించే అవకాశం కల్పిస్తాయి.