Telangana Liberation Day 2025 | హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసుకునేందుకు చేపట్టిన సైనిక చర్యే ఆపరేషన్ పోలో. ఐదు రోజుల పాటు జరిగిన ఈ సైనిక ఆపరేషన్ ద్వారా హైదరాబాద్ సంస్థానం మొత్తం భారతదేశంలో భాగమైంది. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సారథ్యంలోని భారత ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకోగా, ఈ సైనిక చర్యను నాటి హోం మంత్రి వల్లభాయ్ పటేల్ పర్యవేక్షించారు. ఈ ఆపరేషన్ పోలో ఎలా జరిగిందో పూర్తి వివరాలు మీ కోసం ఈ కథనంలో ఉన్నాయి.

Continues below advertisement

ఆపరేషన్ పోలో అంటే అర్థం ఏంటి? ఆ పేరు ఎవరు పెట్టారు?

హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసే సైనిక చర్యకు ఆపరేషన్ పోలో అనే పేరు పెట్టింది జనరల్ జయంత్ నాథ్ చౌధురి. ఈ ఆపరేషన్‌ను నిర్వహించిన భారత సైనిక కమాండర్ ఇతను. ఆపరేషన్ పోలో అనేది సైనిక కోడ్. అయితే, హైదరాబాద్ సంస్థానంలో ఉన్నత వర్గాలు ఆడే పోలో ఆట ఆనాడు చాలా ప్రాచుర్యం పొందిన క్రీడ. ఈ ఆపరేషన్‌కు ఈ పేరే పెట్టారు.

Continues below advertisement

వ్యూహాత్మకంగా ఆపరేషన్ పోలో

హైదరాబాద్ సంస్థానంపై సైనిక చర్య అనివార్యమని భావించిన భారత ప్రభుత్వం 1948, సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో ప్రారంభించింది. అన్ని వైపుల నుండి హైదరాబాద్ సంస్థానాన్ని భారత సైన్యం చుట్టుముట్టింది.

పశ్చిమ దిశ నుండి: భారత ప్రధాన దళాలు షోలాపూర్ నుండి హైదరాబాద్‌లోకి ప్రవేశించాయి.

ఉత్తర దిశ నుండి: ఔరంగాబాద్ వైపు నుండి మరికొన్ని బలగాలు హైదరాబాద్ వైపు సాగాయి.

తూర్పు దిశ నుండి: విజయవాడ, గుంటూరు వైపు నుండి దళాలు హైదరాబాద్ దిశగా కదిలాయి.

దక్షిణ దిశ నుండి: కర్నూలు వైపు నుండి మరో దళం హైదరాబాద్ సంస్థానంలోకి ప్రవేశించింది.

ఇలా వ్యూహాత్మకంగా నలుదిశల నుండి భారత సైన్యం చుట్టుముట్టేసరికి నిజాం పాలకుల్లో వణుకు పుట్టించింది. హైదరాబాద్ సైన్యం, రజాకార్ల ముఠా అయోమయంలో పడిపోయాయి. భారత సైనికుల సైనిక శిక్షణ, క్రమశిక్షణ, ఆయుధాలు, వ్యూహాత్మక ఎత్తుగడ ముందు నిజాం సైన్యం, రజాకార్లు నిలువలేక తోకముడిచారు.

కాల్పులు ఎన్ని రోజులు జరిగాయి? ఎక్కడ జరిగాయి? ప్రాణ నష్టం ఎంత?

భారత సైన్యం, నిజాం సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. ఆపరేషన్ పోలో 1948, సెప్టెంబర్ 13న ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు ఈ సైనిక చర్య సాగింది. సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోవడంతో ఈ ఆపరేషన్ పోలో ముగిసింది. అయితే, నిజాం బలగాలు చాలా చోట్ల భారత సైన్యంతో పెద్దగా పోరాటం జరపలేదు. కానీ, కొద్ది ప్రతిఘటనతో నిజాం సైన్యం భారత సైన్యానికి లొంగిపోయింది. ఈ సైనిక ఘర్షణ ఎక్కువగా హైదరాబాద్ సంస్థానం సరిహద్దు ప్రాంతాల్లో సాగింది. హైదరాబాద్ నగరానికి వచ్చే కీలక రహదారుల వద్ద నిజాం బలగాలు కొద్దిగా ప్రతిఘటించాయి.

నిజాం సైన్యం, రజాకార్లు భారత సైన్యాన్ని ప్రతిఘటించిన ప్రాంతాలు ఇవే:

నల్దుర్గ్, తుల్జాపూర్ (నల్దుర్గ్ కోట): ఇది షోలాపూర్ నుండి, అంటే పశ్చిమం వైపు నుండి హైదరాబాద్‌కు వచ్చే మార్గం. ఇక్కడే భారత సైన్యాన్ని మొదటిగా నిజాం బలగాలు ప్రతిఘటించాయి. కానీ, అవి భారత సైన్యం ఎదుట నిలువలేక చేతులెత్తేశాయి.

జల్నా: ఇక ఔరంగాబాద్ నుండి వచ్చే భారత బలగాలను జల్నా వద్ద, అంటే ఉత్తరం వైపు నుండి నిజాం సైన్యాన్ని ఎదుర్కోవడం జరిగింది. కొద్ది ప్రతిఘటనతో నిజాం బలగాలు తోక ముడిచాయి.

జహీరాబాద్: ఇక భారత సైన్యం హైదరాబాద్‌కు అతి సమీపంగా ఉన్న జహీరాబాద్ వద్ద కూడా నిజాం బలగాలను ఎదుర్కొంది. జహీరాబాద్ హైదరాబాద్ నగరానికి వచ్చే అతి సమీప ప్రాంతమే కాకుండా వ్యూహాత్మక ప్రాంతం కూడా. నిజాం బలగాలు మన సైన్యాల ముందు నిలువలేకపోయాయి.

సూర్యాపేట, కోదాడ: తూర్పు వైపు నుండి, అంటే విజయవాడ - గుంటూరు నుండి కూడా భారత సైన్యం హైదరాబాద్ వైపు దూసుకువచ్చింది. సూర్యాపేట, కోదాడ వంటి ప్రాంతాల్లో రజాకార్లు కొంత మేరకు ప్రతిఘటించారు. అయితే, భారత సైన్యం ముందు రజాకార్ల ప్రతిఘటన నిలువలేదు.

బీదర్ ఎయిర్‌ఫీల్డ్: బీదర్ ప్రాంతం నిజాం పాలిత ప్రాంతం. ఈ ఎయిర్‌ఫీల్డ్ కూడా నిజాం ఆధీనంలో ఉంది. భారత సైన్యానికి ఈ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకోవడం కీలక లక్ష్యంగా పెట్టుకుంది. అక్కడి నిజాం బలగాలను ఓడించి అత్యంత వేగంగా ఈ విమానాశ్రయాన్ని భారత సైన్యం చేజిక్కించుకుంది.

ఈ వ్యూహాత్మక ప్రాంతాల్లో నిజాం సైన్యాన్ని ఓడించిన తర్వాత భారత సైన్యం హైదరాబాద్ నగరాన్ని చేరుకుంది. కానీ, ఇక్కడ పెద్దగా నిజాం బలగాలు ప్రతిఘటించలేదు. పెద్దగా కాల్పులు జరగలేదు. అప్పటికే భారతీయ సైన్యం తీరును చూసి నిజాం బలగాలు, రజాకార్లు నీరుగారిపోయారు. సెప్టెంబర్ 17వ తేదీన మేజర్ జనరల్ చౌధురి నాయకత్వంలోని భారతీయ వీర సైనికులు హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించారు. నిజాం సైతం ఎలాంటి పోరాటం లేకుండా భారత బలగాల ముందు లొంగిపోయారు.

ఆపరేషన్ పోలోలో జరిగిన ప్రాణ నష్టం ఎంతంటే...? నిజాం బలగాలు, రజాకార్లు - భారత సైన్యం మధ్య జరిగిన ఈ పోరులో జరిగిన ప్రాణ నష్టంపై వచ్చిన నివేదికల్లో కొంత వ్యత్యాసాలున్నాయని చరిత్రకారులు చెబుతారు. అయితే, అధికారికంగా 42 మంది భారత సైనికులు ఈ ఆపరేషన్‌లో చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇక నిజాం సైన్యంలో సుమారు 807 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు 1373 మంది రజాకార్లు భారత సైన్యం దాడిలో మరణించారు. అయితే, ఈ ఆపరేషన్ తర్వాత జరిగిన మతపరమైన అల్లర్లలో 30 నుంచి 40 వేల మంది పౌరులు మరణించారని సుందర్‌లాల్ కమిటీ నివేదిక చెబుతోంది. అయితే దీనిపైన భిన్నాభిప్రాయాలున్నాయి.

ఏది ఏమైనా, ఆపరేషన్ పోలో పేరుతో భారత సైన్యం అతి తక్కువ ప్రాణ నష్టంతోనే హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసింది.