EC to issue poll notification in Andhra Pradesh and Telangana - హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. మొత్తం 7 దశలలో దేశంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 16న సీఈసీ రాజీవ్ కుమార్ సార్వత్రిక ఎన్నికలు 2024 షెడ్యూల్ విడుదల చేయగా.. దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని విధాలుగా ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ జరగనుంది.


లోక్‌సభ ఎన్నికలకుగానూ ఇదివరకే మూడు దశల ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేసింది ఈసీ. రేపు (ఏప్రిల్ 18న) నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. నాల్గవ దశలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ (25 స్థానాలు), తెలంగాణ (17), బిహార్ (5), ఝార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), ఉత్తర్ ప్రదేశ్ (13), పశ్చిమ బెంగాల్ (8), జమ్మూకాశ్మీర్ (1). గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. అదే రోజు నుంచి అంటే 18 నుంచే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 25 వరకూ నామినేషన్లు దాఖలుకు గడువు ఇచ్చారు. ఈ 26న నామినేషన్ల పరిశీలన చేపడతారు. చివరికి ఈ29న నామినేషన్ల ఉప సంహరణతో ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. నాలుగో దశలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ స్థానాలకు, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఖాళీ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఇదే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4 న ఓట్లు లెక్కించి, విజేతల్ని ప్రకటించనుంది ఈసీ. 


గురువారం ఏపీ, తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్
ఎన్నికల నోటిఫికేషన్ జారీ - ఏప్రిల్ 18
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం - ఏప్రిల్ 18
నామినేషన్లు దాఖలుకు తుది గడువు  - ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన - ఏప్రిల్ 26
నామినేషన్ల ఉప సంహరణ - ఏప్రిల్ 29
ఏపీ, తెలంగాణలో ఎన్నికలు - మే 13
ఓట్ల లెక్కింపు, విజేతల ప్రకటన - జూన్ 4


ఫేజ్ 1 ఎన్నికలు- ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 102 లోక్ సభ స్థానాలకు పోలింగ్


2వ దశ ఎన్నికలు- ఏప్రిల్ 26న నిర్వహించనున్నారు. అభ్యర్థుల నామినేషన్ల గడువు ఏప్రిల్ 4తో ముగిసింది. రెండవ దశలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 89 స్థానాల్లో ఎన్నికలు.


ఫేజ్ 3 ఎన్నికలు- మే 7న పోలింగ్.. కాగా, అభ్యర్థుల నామినేషన్ల గడువు ఏప్రిల్ 19తో ముగియనుంది. మూడో దశలో భాగంగా 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 94 లోక్ సభ స్థానాలకు పోలింగ్


4వ దశ ఎన్నికలు- మే 13న ఓటింగ్ జరగనుండగా.. అభ్యర్థుల నామినేషన్ల తుది గడువు ఏప్రిల్ 25తో ముగియనుంది. నాల్గవ దశలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు


5వ దశ ఎన్నికలు- మే 20న ఈసీ పోలింగ్ నిర్వహించనుంది. మే 3 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఐదవ దశలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 49 లోక్‌సభ స్థానాలకు పోలింగ్


6వ దశ ఎన్నికలు- మే 25న ఎన్నికలు ఉండగా.. మే 6తో అభ్యర్థుల నామినేషన్ల గడువు ముగియనుంది. ఆరవ దశలో 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 57 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు ఉంటాయి.


7వ దశ ఎన్నికలు- జూన్ 1న పోలింగ్ జరగాల్సి ఉండగా.. అభ్యర్థుల నామినేషన్ల గడువు మే 14తో ముగియనుంది. ఏడవ దశలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్.