EC releases schedule for Vice Presidential election : ఉపరాష్ట్రపతి పదవిని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పదవి ఖాళీ అయితే వెంటనే భర్తీ చేయాలన్న నిబంధన ఉండటంతో ఉపరాష్ట్రపతి రాజీనామా అధికారికంగా ఆమోదం పొందిన వెంటనే సన్నాహాలు ప్రారంభించింది. ఓటర్ల జాబితాను రెడీచేసింది. లోక్ సభ, రాజ్యసభల్లో సభ్యులంతా ఓటు హక్కు కలిగి ఉంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అయితే ఎమ్మెల్యేలు కూడా ఓటర్లుగా కూడా ఉంటారు.కానీ ఉపరాష్ట్రపతి పదవికి మాత్రం పార్లమెంట్ సభ్యులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటారు.
ఏడో తేదీ నుంచి నామిషన్లు ప్రారంభమవుతాయి. 21వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. పోలింగ్ అవసరం అయితే వచ్చే నెల తొమ్మిదో తేదీన నిర్వహిస్తారు. అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు.
ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అన్నదానిపై అధికార ఎన్డీఏలో ఇంకా క్లారిటీ లేదు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో సహా చాలా మంది పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. నామినేషన్లకు చివరి తేదీ ఆగస్టు 21వ తేదీ కాబట్టి.. చివరి వరకూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదని భావిస్తున్నారు. నామినేషన్ల గడువుకు రెండు రోజుల ముందు బీజేపీ హైకమాండ్ పేరును ఖరారు చేసే అవకాశం ఉంది. ఎవరూ ఊహించని అభ్యర్థులను రంగంలోకి తీసుకు వచ్చే చాన్సులు ఉన్నాయి. బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉపరాష్ట్రపతిని ఎంపిక చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మిత్రపక్షాలకు ఇచ్చే అవకాశం లేదని.. బీజేపీ నుంచి మాత్రమే ఉపరాష్ట్రపతి ఉంటారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.
మరో వైపు ఇండియా కూటమి అభ్యర్థిని నిలబెట్టకపోతే ఏకగ్రీవం అవుతుంది. పోటీకి అభ్యర్థిని పెట్టాలని ఇండియా కూటమి భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఓటింగ్ ఖాయం. ఓటింగ్ జరగాల్సి వస్తే సెప్టెంబర్ 9న నిర్వహిస్తారు. కౌంటింగ్ కూడా అదే రోజు జరుగుతుంది. ఉపరాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన, నామినేటెడ్ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతి ని ఎన్నుకుంటుంది. ఎన్నిక ఒకే బదిలీ ఓటు (Single Transferable Vote) ద్వారా జరుగుతుంది. గెలుపొందడానికి అభ్యర్థికి సభలోని మొత్తం ఓట్లలో సగం కంటే ఎక్కువ అంటే సాధారణ మెజారిటీ అవసరం. అభ్యర్థి నామినేషన్‌ను దాఖలు చేయడానికి కనీసం 20 మంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ప్రతిపాదకులుగా, 20 మంది బలపరిచేవారిగా సంతకం చేయాలి.
ఉపరాష్ట్రపతి పదవీకాలం 5 సంవత్సరాలు. 2025 జులై 21న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ ఆరోగ్య కారణాలతో రాజీనామా చేశారు. దీంతో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ప్రస్తుతం జరిగేది ఉపఎన్నిక కాదు. అందుకే ఎన్నికయ్యే వారు ఐదేళ్లు పదవిలో ఉంటారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు . రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహిస్తారు .