Election Commission Preparations For Loksabha Elections :   2024 లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది.   నాలుగు రాష్ట్రాల్లో ట్రాన్సఫర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది.  ఎన్నికల అధికారుల బదిలీలు, పోస్టింగులపై మార్గదర్శకాలు జారీ చేసింది.  ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కీం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులు, చీఫ్ సెక్రటరీలకు ఆదేశాలు పంపింది. ఒకే చోట మూడేళ్లకుపైగా పని చేస్తున్న వారిని బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది. 


ఏపీలో పర్యటించనున్న ఎన్నికల సంఘం బృందం                           


మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) అధికారుల బృందం రెండ్రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో పర్యటించనుంది. సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేష్‌ వ్యాస్‌ సహా డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ హిర్దేశ్‌ కుమార్‌ల బృందం డిసెంబరు 22, 23 తేదీల్లో పర్యటిస్తుంది. సీఎస్‌, డీజీపీ, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ఉంటుుంది. 2024 ఓటర్ల జాబితా రూపకల్పనతో పాటు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై ఈసీ బృందం సమీక్షించనుంది. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల   నిర్వహణ సన్నద్ధత పరిస్థితిపై జిల్లా కలెక్టర్లు నివేదికలు సమర్పించనున్నారు. ఈ నెల 23న సీఎస్‌, డీజీపీతో పాటు కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేకంగా భేటీ కానున్నారు.


ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం                


 వచ్చే ఏడాది ఫిబ్రవరి 20నాటికి సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ఇరవై రోజుల ముందుగానే ఇచ్చారు. అలాగే ఏపీలోనూ గత షెడ్యూల్‌ కంటే 20 రోజుల ముందే వచ్చే వీలుందని ఇప్పటికే సీఎం జగన్ తో పాటు చంద్రబాబు కూడా గతంలో చెప్పారు.  2019 ఎన్నికల షెడ్యూల్‌ మార్చి 10వ తేదీన విడుదలైంది. ఈసారి ఫిబ్రవరి 20న విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 


పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఏపీ ఎన్నికలు                                   
 
ఢిల్లీ అధికార వర్గాల సమాచారం మేరకు   ఫిబ్రవరి 15-20 మధ్య ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో బోగస్ ఓట్ల పైన వైసీపీ, టీడీపీ పోటా పోటీగా ఇస్తున్న ఫిర్యాదుల పైన ఎన్నికల సంఘం ఆరా తీస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయిలోనూ ఎన్నికల దిశగా కసరత్తు మెుదలైనట్లు తెలుస్తోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, పోలింగ్ కేంద్రాల వివరాలను ఎన్నికల అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఓటర్లకు నమోదు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం.  పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఏపీ ఎన్నికలు జరుగుతాయి.