రాజ్‌‌కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన చిత్రమే ‘డంకీ’ (Dunki). తన ప్రతీ చిత్రంలో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా ఏదో ఒక ఎమోషనల్ పాయింట్‌ను చేరుస్తారు హిరానీ. అలాగే ‘డంకీ’ చిత్రంలో అలాంటి ఒక కీలకమైన అంశంగా మారింది ‘డంకీ రూట్’ (డాంకీ రూట్ అని కూడా పిలుస్తారు). డిసెంబర్ 21న ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యింది. బెనిఫిట్ షో నుండే ‘డంకీ’కి చాలావరకు పాజిటివ్ టాక్ లభించింది. అంతే కాకుండా ‘డాంకీ రూట్’ అంటే ఏంటి అని అనుమానం కూడా మొదలయ్యింది. ఇది ఇండియా నుంచి అమెరికా, యూకే, కెనడా వంటి ఫారిన్ దేశాలకు వెళ్లాలనుకునేవారికి దారి చూపించే మార్గం. కానీ ఈ మార్గంలో ప్రయాణం చట్టవిరుద్ధం. డాంకీ అంటే గాడిదే. కానీ, గాడిదలతో ఈ రూట్‌కు సంబంధం ఉండదు. ఆ మార్గంలో ప్రయాణించాలంటే గాడిదలా శ్రమించాలి. అందుకే దాన్ని డాంకీ రూట్ అనేవారు. స్థానికులు ‘డంకీ’ అని పిలుస్తారు.


డాంకీ ట్రావెల్స్ అంటారు


ఇప్పటికీ పంజాబ్, హర్యానా, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి చాలామంది యువత.. ఈ డంకీ రూట్ ద్వారా ఫారిన్ దేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటారు. కానీ ఇది అంత ఈజీ కాదు. ఎన్నోరోజుల పాటు ఆహారం లేకుండా నడిచే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. దట్టమైన అడవుల మధ్య నుంచి, చెరువుల, నదుల మధ్య నుంచి ప్రయాణించవలసి ఉంటుంది. ఎందుకంటే అలాంటి మార్గాల్లోనే అధికారులు ఉండరు. ఇది చట్టవిరుద్ధమైన, చాలా డేంజర్ అయినా కూడా యూత్‌లో మాత్రం ఈ డాంకీ రూట్ చాలా ఫేమస్. ఇప్పటికే ఎంతోమంది యూత్.. తమ అమెరికా కలలను నిజం చేసుకోవడానికి ఈ రూట్‌ను ఫాలో అయ్యారు. తాజాగా ఒక దుబాయ్ ఈవెంట్‌లో పాల్గొన్న షారుఖ్ ఖాన్ ‘డంకీ’ అంటే అర్థం చెప్పారు. ‘‘చాలామంది ప్రపంచ సరిహద్దులకు చట్టవిరుద్ధంగా దాటాలి అనుకోవడమే డంకీ. అసలైతే దీనిని డాంకీ ట్రావెల్స్ అని కూడా అంటారు’’ అని తెలిపారు.


ఖర్చుతో కూడుకున్న పని


యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ డేటా ప్రకారం.. 2022 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ మధ్యలో దాదాపు 42 వేలమంది ఇండియా నుంచి చట్టవిరుద్ధంగా దక్షిణాది బోర్డర్‌లను దాటారు. నవంబర్ 2022 నుంచి ఇప్పటివరకు దాదాపు 97 వేల మంది ఇండియన్స్ చట్టవిరుద్దంగా అమెరికాలోకి ప్రవేశించాలని చూసి అక్కడ పోలీసులకు పట్టుబడ్డారు. పంజాబ్ నుంచి వలస వెళ్లేవారు కెనడాను ఎంపిక చేసుకుంటే.. హర్యానా యూత్ మాత్రం అమెరికానే తమ టార్గెట్‌గా పెట్టుకుంటారు. ఈ డాంకీ రూట్ అనేది చట్టవిరుద్ధం మాత్రమే చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా. ఇందులో ప్రయాణించాంటే దాదాపు రూ. 15 నుంచి 40 లక్షలు కావాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ మార్క్ రూ.70 లక్షలకు కూడా టచ్ అవుతుంది. ఎంత ఎక్కువ ఖర్చుపెడితే.. అంత తక్కువ రిస్క్‌తో వెళ్లిపోవచ్చు. ఇండియా నుంచి బయల్దేరిన వారు ఎక్కువగా ఈ డాంకీ మార్గం నుంచి లాటిన్ అమెరికాకు చేరుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. ఎందుకంటే లాటిన్ అమెరికాకు చేరుకోవడం మిగతా ప్రాంతాలతో పోలిస్తే సులభం.


నేరస్థులకు మార్గం


కేవలం అమెరికన్ కలలు కనే యూత్ మాత్రమే కాదు.. కొందరు నేరాలకు పాల్పడే వ్యక్తులు కూడా ఈ డంకీ రూట్‌ను తప్పించుకునే మార్గంగా ఎంచుకుంటారు. రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్నీ సేనా చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య జరిగిన సమయంలో ఈ హత్యకు ప్లాన్ చేసిన రోహిత్ గోదార కూడా డంకీ రూట్ ద్వారానే అమెరికా పారిపోయాడని సమాచారం. ఇప్పటికే రోహిత్‌పై పలు క్రిమినల్ కేసులు ఉండగా.. తను ఎక్కువసార్లు ఈ డంకీ రూట్‌ను పారిపోవడానికి ఉపయోగించాడని తెలుస్తోంది. ఈ డంకీ రూట్‌లో ఒక మార్గం వల్ల ఇబ్బందులు ఎదురయితే ప్రయాణించేవారికి మరో రెండు, మూడు ఆప్షన్స్ కూడా ఉంటాయి.


Also Read: 'డంకీ' రివ్యూ: 'పఠాన్', 'జవాన్' తర్వాత 2023లో షారుఖ్ ఖాన్‌కు హ్యాట్రిక్ అవుతుందా? లేదా?