AP High Court Amaravati case : విశాఖకు కార్యాలయాలను తరలించాలనుకున్న ఏపీ ప్రభుత్వ ఆశలపై హైకోర్టు నీళ్లు చల్లింది.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు పేరుతో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించే యత్నాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని ట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు  నిర్ణయించారు.  త్రిసభ్య ధర్మాసనం తన నిర్ణయం వెల్లడించేవరకూ యథాతథ స్థితి  పాటించేలా ప్రభుత్వాన్ని ఆదేశిశించారు.   త్రిసభ్య ధర్మాసనం తీర్పు వచ్చేంత వరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధించింది. 


సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు ముసుగులో విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుచేస్తున్నారని అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్‌ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని ప్రాంత రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం హైకోర్టులో వ్యాజ్యం దాఖలుచేశారు. ఇదే వ్యవహారంపై రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు, అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడు కల్లం రాజశేఖరరెడ్డి వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు.  


మంగళవారం జరిగిన విచారణలో ప్రభుత్వ న్యాయవాదులు సుమన్‌, మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుత వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని కోరారు. ఈ అభ్యర్థనతోనే అనుబంధ పిటిషన్‌ వేశామన్నారు. సీఎం క్యాంపు కార్యాలయ వ్యవహారం త్రిసభ్య ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉందన్నారు. అందువల్ల ప్రస్తుత వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని కోరుతున్నామన్నారు. విచారణ లోతుల్లోకి వెళ్లే ముందు తాము దాఖలుచేసిన అనుబంధ పిటిషన్‌ను తేల్చాలని కోరారు.            


బుధవారం జరిగిన విచారణలో   హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలిస్తున్నారని పిటిషనర్ తరపు లాయర్లు వాదించారు.  ఫర్నిచర్‌ సైతం కొనుగోలు చేశారని చెప్పారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఇరువైపుల న్యాయవాదుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకొని త్రిసభ్య ధర్మాసనంవద్దకు వ్యాజ్యాల్ని పంపాలని భావిస్తున్నట్లు.. త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం వెల్లడించేవరకూ కార్యాలయాల తరలింపుపై స్టేటస్‌ కో జారీ చేస్తానని ప్రతిపాదించినట్లు తెలిపారు.  ఈ రోజు విచారణలో ఆ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.                                             


విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ సర్కారు గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. రిషికొండ మిలినియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంపు కార్యాలయాలను హై లెవెల్‌ కమిటీ గుర్తించింది. మిలీనియం టవర్స్‌లోని ఏ, బీ టవర్స్‌ను కేటాయించారు. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శాఖల సొంత భవనాలు, స్థలాలను తొలి ప్రాధాన్యంగా వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు. సొంత భవనాలు లేని శాఖలు, అధికారుల కార్యాలయాలకు మిలీనియం టవర్స్‌ను కేటాయించారు.  రుషికొండపై నిర్మించిన  భవనంలో సీఎం  జగన్ ఉంటారు.