East Godavari News: తూర్పు గోదావరి జిల్లా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. విజయవాడ నుంచి రాజమండ్రికి వెళ్తుండగా... ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే విషయం గుర్తించిన స్థానికులు కారులో ఉన్న వారికి సాయం చేసే ప్రయత్నం చేయబోయారు. కానీ అప్పటికే వారంతా చనిపోయి ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు అంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలతో పాటు రెండేళ్ల చిన్నారి కూడా ఉంది.
వారం రోజుల క్రితం గుంటూరులో రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వట్టిచెరుకూరు వద్ద ట్రాక్టర్ బోల్తా పడి ఆరుగురు స్పాట్‌లోనే చనిపోయారు. కొండేపాడు గ్రామానికి చెందిన వారు ట్రాక్టర్లో ఓ శుభకార్యానికి హాజరు కావడానికి జూపూడికి బయలు దేరారు. మొత్తం 32 మంది మహిళలే ఉన్నారు. ఆందరూ బంధువులో కావటంతో చాలా ఆనందంగా బయలు దేరారు. వట్టిచెరుకూరు దాటిన తర్వాత ఒక్క సారిగా ట్రాక్టర్ బోల్తా కొట్టింది. పక్కనే ఉన్న పొలంలో ఉన్న ఎండిపోయిన పంట కాలవలో ట్రాక్టర్ పడిపోయింది.
ట్రాలీ కింద పడి అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. ట్రక్టర్ బోల్తా కొట్టిన సంఘటన తెలుసుకొని గ్రామస్థులు అక్కడికి జేసీబీతో వచ్చి మిగతా వారిని కాపాడే ప్రయత్నం చేశారు. 108లో క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. మార్గ మద్యలో మరొకరు మృతి చెందగా హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ మరో వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్టర్ ప్రమాదంలో మొత్తంగా ఎనిమిది మంది మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 30 మంది ఉన్నట్లు సమాచారం. మృతులు మిక్కిలి నాగమ్మ, మామిడి జాన్సీరాణి, కట్టా నిర్మల, గరికపూడి మేరిమ్మ, గరికపూడి రత్నకుమారి, గరికపూడి సుహాసినిగా గుర్తించారు.
సీఎం జగన్ దిగ్భ్రాంతి - రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన
గుంటూరు జిల్లా ట్రాక్టర్ బోల్తా ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ దురదృష్టకర ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు సీఎం జగన్ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అదే సమయంలో తీవ్రంగా గాయపడ్డవారికి రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు. స్వల్ప గాయాలైన వారికి రూ.25 వేలు సాయం అందించాలని బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారుల్ని సీఎం జగన్ ఆదేశించారు.
చంద్రబాబు దిగ్భ్రాంతి
ప్రమాదం తన మనసును తీవ్రంగా కలిచివేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శుభకార్యానికి వెళ్తూ విగత జీవులుగా మారడం బాధాకరమని అన్నారు. మృతులు అంతా పేద కుటుంబాలకు చెందిన వారు అయినందున మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సూచించారు. అలాగే వారి బిడ్డల భవిష్యత్‌కు భరోసా ఇచ్చి ఆ కుటుంబాలకు బాసటగా నిలవాలని అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.