Earthquake in Indonesia: ఇండోనేషియాలో మరోసారి భూ ప్రకంపనలు (Indonesia Earthquake) నమోదయ్యాయి. జావా ద్వీపంలో 6.5 మ్యాగ్నిట్యూడ్‌తో భూకంపం నమోదైనట్టు అక్కడి మెటరాలజీ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. United States Geological Survey వెల్లడించిన వివరాల ప్రకారం...జావా ద్వీపంలో ఈ భూకంపం రాగా అటు రాజధాని నగరం జకార్తాలోనూ ఈ ప్రభావం కనిపించింది. భారీ భవనాలు ఒక్కసారిగా కదిలిపోయాయి.  అప్రమత్తమైన ప్రజలు ఇళ్లలో నుంచి హుటాహుటిన బయటకు వచ్చారు. సాధారణంగా ఇక్కడ ఎప్పుడు భూకంపం వచ్చినా 5 సెకన్ల పాటు భవనాలు ఊగిపోతాయి. కానీ ఈ సారి 10-20 సెకన్ల వరకూ ఈ ప్రభావం కనిపించినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే...ప్రస్తుతానికి అక్కడ సునామీ హెచ్చరికలు మాత్రం జారీ చేయలేదు. అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. 10 కిలోమీటర్ల లోతు వరకూ భూకంప తీవ్రత నమోదైనట్టు వెల్లడించారు. జకార్తాతో పాటు బంటెన్ ప్రావిన్స్‌లోనూ స్వల్పంగా భూమి కంపించింది. 


ఇప్పుడే కాదు. ఇండోనేషియాలో ఇలా భూకంపాలు తరచూ వస్తూనే ఉంటాయి. ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులు ఆ దేశాన్ని తరచూ ఇలా భూకంపాల బారిన పడేలా చేస్తోంది. ఇక్కడి భూమిలోని టెక్టానిక్ ప్లేట్స్‌ ఉన్న తీరే భూకంపానికి కారణమవుతున్నాయి. 2021లోనూ ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో భారీ భూకంపం నమోదైంది. ఈ ఘటనలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అంతకు ముందు 2018లో 7.5 మ్యాగ్నిట్యూడ్‌తో భూకంపం వచ్చింది. ఈ తీవ్రతకి సునామీ కూడా రావడం వల్ల 2,200 మంది మృతి చెందారు. 2004లో ఏకంగా 9.1 తీవ్రతతో భూకంపం వచ్చి లక్షా 70 వేల మందిని బలి తీసుకుంది.