Trump's Swearing-in Ceremony : ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు ట్రంప్. అయితే భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరవుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ట్రంప్-వాన్స్ ప్రారంభోత్సవ కమిటీ ఆహ్వానం మేరకు జైశంకర్ వేడుకలకు హాజరుకానున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో ఇన్‌కమింగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధులతో పాటు అమెరికాను సందర్శించే మరికొందరు ప్రముఖులతో కూడా సమావేశం కానుంది.

జై శంకర్ అమెరికా పర్యటన

డిసెంబర్ 24-29, 2024లో జైశంకర్ అమెరికా అధికార పర్యటన చేశారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా ట్రంప్ నామినీ మైఖేల్ వాల్ట్స్‌ను కలుసుకున్నారు. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ అంశాలతో సహా పలు అంశాలపై ఇరువురు చర్చించారు. ట్రంప్ కొత్త అడ్మినిస్ట్రేషన్, భారత ప్రభుత్వం మధ్య జరిగిన తొలి అత్యున్నత స్థాయి సమావేశం ఇదే. ఇప్పుడు ట్రంప్-వాన్సె ఇనాగరల్ కమిటీ ఆహ్వానం మేరకు 47వ దేశాధ్యక్షుడుగా డొనాల్డ్ ఎస్.ట్రంప్ ప్రమాణస్వీకారానికి జైశంకర్ హాజరుకానున్నారు.

ఘనంగా ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం

జనవరి 20న వాషింగ్టన్ డీసీలోని కాపిటల్ ముందు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్‌.. డోనాల్డ్ ట్రంప్ చే అధ్యక్ష ప్రమాణం చేయించనున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డేనే జరగడం గమనార్హం. ఈ శతాబ్దంలో ఫెడరల్ సెలవుదినం రోజున అధ్యక్షుడిగా ప్రమాణం చేయడం ఇదే తొలిసారి. భారత కాలమానం ప్రకారం ఈ వేడుక రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆయనతో పాటు జేడీ వాన్స్ కూడా ఈ రోజునే యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాధారణంగా రాష్ట్రపతి ఎదుట ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేస్తారు. 

రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణం

అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ఎన్నిక కావడం ఇది రెండోసారి. ఆ దేశ 45వ అధ్యక్షుడిగా మొదటిసారి పగ్గాలు చేపట్టిన ట్రంప్.. 2017 జనవరి నుంచి 2021 జనవరి వరకు ఆయనే ఉన్నారు. నవంబర్‌ 2024లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌పై రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ విజయం సాధించారు. ఇక ఇప్పుడు అమెరికా క్యాపిటల్ భవనంలోని వెస్ట్ ఫ్రంట్ ప్రాంతం వేదికగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నేతలు హాజరుకానున్నారు. అంతేకాకుండా ఈ వేడుకకు భారతీయ అమెరికన్ డోల్ బ్యాండ్ సందడి చేయనున్నట్టు ప్రచారం నడుస్తోంది.

Also Read : BCCI New Secretary: బీసీసీఐలో నూతన శకం - ఊహించినట్లుగానే కార్యదర్శిగా సైకియా, తను ముందుర సవాళ్లెన్నో!