BCCI New Secretary: బీసీసీఐలో నూతన శకం - ఊహించినట్లుగానే కార్యదర్శిగా సైకియా, తను ముందుర సవాళ్లెన్నో!
BCCI: బీసీసీఐ నూతన కార్యదర్శిగా అందరూ అనుకున్న పేరుకే టిక్ మార్కు పడింది. ముందర ఎన్నో సవాళ్లున్న నేపథ్యంలో కొత్త కార్యదర్శి సైకియా ఎలాంటి ప్రణాళికలతో వీటిని చక్కదిద్దుతారో చూడాలి.

BCCI News: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు కార్యదర్శిగా దేవజిత్ సైకియా బాధ్యతలు చేపట్టాడు. ఐసీసీ ఛైర్మన్‌గా జై షా వెళ్లిపోయాక ఇప్పటివరకు తాత్కాలిక కార్యదర్శిగా వ్యవహరించిన సైకియా.. ఆదివారం నుంచి పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టాడు. ఆదివారం జరిగిన ప్రత్యేక సర్వ సభ్య సమావేశంలో ఈ మేరకు సైకియాను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. కార్యక్రమం ముగిశాక బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీతోపాటు సైకియా బయటకు వచ్చిన ఫొటోలు వైరలయ్యాయి. క్రికెట్ ప్రపంచంలోనే బీసీసీఐ అత్యంత పవర్ ఫుల్ అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీసీసీఐ నుంచే ఐసీసీకి అత్యధిక ఆదాయం వెళ్తుండటంతో ఐసీసీలో బోర్డు మాటలకు తిరుగులేదనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో ఎన్నోసార్లు బోర్డు మాటను కాదని ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాంటి బోర్డుకు కార్యదర్శిలాంటి పవర్ ఫుల్ పోస్టు చేపట్టిన సైకియాను పలువురు అభినందిస్తున్నారు.
అస్సోం నుంచి ప్రయాణం..
ఈశాన్య రాష్ట్రమైన అసోం నుంచి సైకియా క్రికెట్ ప్రయాణం మొదలైంది. డొమెస్టిక్ క్రికెట్లో కొద్దికాలం పాటు ఆయన క్రికెట్ ఆడారు. ఆ తర్వాత బోర్డు అధికారిక కార్యకలపాల్లో చురుకుగా వ్యవహరించడం మొదలు పెట్టారు. జై షా బోర్డు కార్యదర్శిగా ఎంపికయ్యాక సైకియాకు ప్రాధన్యత ఎక్కువగా పెరిగింది. ఈ క్రమంలో తన వారసుడిగా సైకియాకు జై షానే ఎంపిక చేశారనే కథనాలు ఉన్నాయి. ఇక డొమెస్టిక్ క్రికెట్ నుంచి వచ్చిన సైకియాకు భారత దేశవాళీ క్రికెట్ గురించి బాగా తెలుసు. దేశవాళీ క్రికెట్ మరింతగా డెవలప్ అయ్యేందకు చర్యలు తీసుకోవాలని మాజీలు సూచిస్తున్నారు. అలాగే వర్థమాన క్రికెటర్లకు చేదోడు వాదోడుగా బోర్డు చర్యలు ఉండాలని పేర్కొంటున్నారు. ఏదేమైనా బీసీసీఐ కార్యదర్శిగా పగ్గాలు చేపట్టడంతో క్రికెట్ ప్రపంచంలో తనో సెలెబ్రెటీ లెవల్ గుర్తింపు వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సవాళ్లెన్నో..
గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన భారత్.. ఈ మధ్య వన్డే, టెస్టుల్లో ఇబ్బంది పడుతోంది. దశబ్ధాల తర్వాత శ్రీలంక చేతిలో వన్డే సీరీస్ కోల్పోవడంతో ఇండియా పతనం ప్రారంభమైంది. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ కోల్పోవడంతో ఆ పతన పతాకస్తాయికి చేరింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్లో 1-3తో సిరీస్ కోల్పోవడం, పదేళ్ల తర్వాత బీజీటీని ఆసీస్ కు అప్పగించడం దాంతోపాటు ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించడం తదితర కారణాల వల్ల టెస్టు క్రికెట్ సంక్షోభంలో నిలిచింది. అలాగే సినియర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ భవితవ్యాలను తేల్చడం, స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రాకు ధీటైనా బౌలర్ ను తయారు చేయడం లాంటి సవాళ్లెన్నో ముందున్నాయి. వీటన్నింటికి సైకియా ఎలా ఎదుర్కొంటారో చూడాలి.