DWC Chief Swati Maliwal:



విపరీతంగా కొట్టేవాడు: స్వాతి మలివాల్


ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానూ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు చెప్పారు. చిన్నతనంలో తన తండ్రే లైంగికంగా వేధించే వాడని అన్నారు. ఓ అవార్డు ఫంక్షన్‌లో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. తనకు ఎదురైన ఆ చేదు అనుభవం గురించి పంచుకున్నారు. 


"నా చిన్నతనంలో నాన్నే నన్ను లైంగికంగా వేధించాడు. నన్ను విపరీతంగా కొట్టే వాడు. ఆయన ఇంటికి వచ్చాడంటే చాలు నేను భయంతో వణికిపోయేదాన్ని. కనపడకుండా మంచం కింద దాక్కునేదాన్ని. నాలుగో తరగతి వరకూ నేను ఆయనతోనే ఉన్నాను. ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్న వాళ్లే బాధితుల ఆవేదనను అర్థం చేసుకోగలరు. అలా అర్థం చేసుకున్నప్పుడే వారిలో ధైర్యం వస్తుంది. అదే మొత్తం వ్యవస్థను మార్చేస్తుంది"


- స్వాతి మలివాల్, ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ 






అంతకు ముందు ABP Newsతో చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సమయంలోనూ స్వాతి మలివాల్ ఈ చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు. చిన్నతనంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో వివరించారు. తన సోదరిని, తల్లిని తండ్రి విపరీతంగా కొట్టే వాడని, అది చూసి భయపడిపోయే దాన్నని చెప్పారు. బాల్యమంతా గృహ హింసకు బాధితురాలిగానే బతికానని అన్నారు. 


ఖుష్బూకి కూడా ఇవే వేధింపులు..


ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన నటి కుష్బూ సుందర్. తెలుగులోనూ పలు సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ మధ్యే జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా పదవి చేపట్టారు. ఇటీవలే మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే తాను కూడా లైగింక వేధింపులకు గురైనట్లు చెప్పారు. చిన్న వయసులోనే తన తండ్రే ఈ దారుణానికి పాల్పడ్డారంటూ సంచలన విషయాలు వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కుష్బూ, పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. చిన్నతనం నుంచే తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని తెలిపారు. అదీ, కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి నుంచే కావడం దారుణం అన్నారు. 8 ఏళ్ల వయసులోనే తనపై లైంగిక దాడికి ప్రయత్నించినట్లు చెప్పారు. 15 ఏళ్ల వయసు వచ్చాక అతడిని ఎదిరించడం మొదలు పెట్టినట్లు తెలిపారు. 16 ఏళ్ల వయసులోనే కుటుంబాన్ని వదిలిపెట్టి తన తండ్రి వెళ్లిపోయినట్లు చెప్పారు. “పిల్లలు వేధింపులకు గురైనప్పుడు, ఆ ఘటనను వారు జీవితాంతం మర్చిపోలేరు. అదో మచ్చగా మిగిలిపోతుంది. నా తల్లి అత్యంత దారుణమైన వివాహ జీవితాన్ని ఎదుర్కొంది. నిత్యం మా అమ్మను, మమ్మల్ని కొట్టేవాడు. నన్ను లైంగికంగా వేధించడం తన జన్మ హక్కుగా భావించేవాడు.  8 ఏళ్ల వయసు నుంచే సెక్స్ వల్ హెరాస్ మెంట్ ఎదుర్కొన్నాను. 15 ఏళ్ల వయసులో అతడికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం వచ్చింది. 16 ఏళ్ల వయసు వచ్చే నాటికి తను మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఈ విషయం మా అమ్మకు చెప్పలేదు. తనకు ఇప్పుడు చెప్పినా నమ్మకపోవచ్చు” అని కుష్బూ తెలిపారు.  


Also Read: Mohit Joshi: ఇన్‌ఫోసిస్ అధ్యక్షుడు మోహిత్ జోషి రాజీనామా, 20 ఏళ్ల ప్రయాణానికి ఫుల్‌స్టాప్