Sperm Donor in Netherlands:
16 ఏళ్లుగా డొనేషన్
స్పెర్మ్ డొనేషన్ మన దగ్గర తక్కువే కానీ...విదేశాల్లో ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో నడుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా క్లబ్‌లు కూడా అక్కడ ఏర్పాటయ్యాయి. అయితే...ఈ స్పెర్మ్ డొనేషన్‌కి కూడా రూల్స్ ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు...ఇష్టమొచ్చినట్టు ఇవ్వడానికి వీల్లేదు. రూల్స్ ఫాలో అవ్వకపోతే ప్రభుత్వం గట్టిగానే చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు నెదర్లాండ్స్‌లో అదే జరిగింది. ఓ 41 ఏళ్ల వ్యక్తి దాదాపు 16 ఏళ్లుగా వీర్యదానం చేస్తున్నాడట. ఇప్పటి వరకూ 550-600 చిన్నారులకు తండ్రి అయ్యాడు. అన్నేళ్లుగా స్పెర్మ్స్ డొనేట్ చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న డచ్ కోర్టు...వెంటనే అతనిపై నిషేధం విధించింది. ఇకపై దానం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఆ వ్యక్తి పేరు జొనతన్ మీజర్ (Jonathan Meijer). కోర్టు తీర్పుని ఉల్లంఘించి మళ్లీ వీర్యదానం చేస్తే లక్ష యూరోల జరిమానా కట్టాల్సి వస్తుందని హెచ్చరించింది. అంటే మన కరెన్సీలో రూ.90 లక్షలు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే...ఇప్పటికే కొన్ని క్లినిక్‌లకు వీర్యాన్ని డొనేట్ చేశాడు మీజర్. వాటిని ఇప్పటికిప్పుడు నిర్వీర్యం చేయాలని ఆయా క్లినిక్స్‌కి లేఖ రాయాలని కోర్టు ఆదేశించింది. ఇదంతా ఓ మహిళ కంప్లెయింట్‌తో వెలుగులోకి వచ్చింది. హేగ్ సిటీలోని కోర్ట్‌లో మీజర్‌పై పిటిషన్ వేసింది. వీర్యదానం ఎంతమందికి చేస్తున్నాడన్న వివరాలు దాచి పెట్టి అందరినీ మోసం చేశాడంటూ మండి పడింది. అంతే కాదు. తమ ఫ్యామిలీలోనే చాలా మందికి తాను స్పెర్మ్స్ డొనేట్ చేశాడని, కానీ ఈ విషయం చెప్పలేదని ఆరోపించింది ఆ మహిళ. అందుకే కోర్టులో పిటిషన్ వేసినట్టు వివరించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు...మహిళ చేసిన ఆరోపణలు నిజమే అని తేల్చింది. వెంటనే...మీజర్‌కు నోటీసులు ఇచ్చింది. ఇకపై డొనేట్ చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.
రూల్స్ ఇవీ..
ఇప్పటి వరకూ జొనతన్ మీజర్ దాదాపు 13 క్లినిక్స్‌లో వీర్యదానం చేశాడు. ఇందులో 11 క్లినిక్స్ నెదర్లాండ్స్‌లోనే ఉన్నాయి. డచ్ క్లినికల్ రూల్స్ ప్రకారం...12 మంది మహిళలకు మించి వీర్యదానం చేయడానికి వీల్లేదు. అంతే కాదు. 25 మంది కంటే ఎక్కువ మంది చిన్నారులకు తండ్రి అవడానికీ అవకాశముండదు. ఇలా చేస్తే దాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. పిల్లల్లో మానసిక సమస్యల్ని అరికట్టేందుకు ఈ రూల్ పెట్టారు. తమకు వందలాది మంది తోబుట్టువులు ఉన్నారని తెలిస్తే అది వాళ్ల మానసిక స్థితిని డిస్టర్బ్ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. 2007లో వీర్యదానం చేయడం మొదలు పెట్టిన మీజర్...ఇప్పటి వరకూ 600 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. ఇకపై డొనేట్ చేయడం కుదరదు. నిజానికి 2017లోనే డచ్ క్లినిక్స్ అతనిపై నిషేధం విధించాయి. ఇష్టమొచ్చినట్టు వీర్యదానం చేస్తున్నాడని మండి పడ్డాయి. అప్పటి నుంచి ఆన్‌లైన్ వ్యాపారం మొదలు పెట్టాడు మీజర్. ఎవరికి కావాలంటే వాళ్లకు డొనేట్ చేస్తూ వస్తున్నాడు. ఇది అక్రమం అని కోర్టు తేల్చి చెప్పింది. కానీ...మీజర్ తరపు లాయర్ మాత్రం..తల్లిదండ్రులు లేని వాళ్లకు సాయం చేస్తున్నాడంటూ వాదిస్తున్నాడు. ఏదేమైనా కోర్టు ఇప్పటికీ తీర్పునిచ్చేసింది.
Also Read: సూర్యుడు జస్ట్ గ్యాప్ ఇచ్చాడంతే, మే నెలలో మళ్లీ నిప్పులే - ఎకానమీకి కూడా ముప్పే