Roja On Rajinikanth :    2024  ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ అవుతుందని.. ఎన్టీఆర్ ఆశీస్సులు చంద్రబాబుకు ఉంటాయని సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. రజనీకాంత్‌కు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదన్నారు.  ఆయన వ్యాఖ్యలతో ఎన్టీఆర్‌ ఆత్మ కూడా బాధపడుతుందని పేర్కొన్నారు.. ఎన్టీఆర్‌పై దారుణంగా కార్టూన్లు వేసి అవమానించిన వ్యక్తి చంద్రబాబు.. ఇప్పుడు రజనీకాంత్‌తో అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు.                             


చంద్రబాబు గురించి  ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోలు రజనీకాంత్‌కు ఇస్తానన్న రోజా 


చంద్రబాబు గురించి ఎన్టీఆర్‌ ఏమన్నారో.. రజనీకాంత్‌కు వీడియోలు ఇస్తానని రోజా ప్రకటించారు.  ఎన్టీఆర్‌ అభిమానులను బాధపట్టేలా రజనీ మాట్లాడారనా విమర్శించారు..  చంద్రబాబు విజన్‌, హైదరాబాద్‌ అభివృద్ధిపై రజనీ చేసిన  వ్యాఖ్యలపైనా స్పందించారు. చంద్రబాబు లేనప్పుడే హైదరాబాద్‌ అభివృద్ధి చెందింది. విదేశాల్లో తెలుగువారు ఉద్యోగాలు పొందడానికి కారణం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డే అన్నారు.. దానికి కారణం చంద్రబాబు కాదని రజనీకాంత్‌ తెలుసుకోవాలని సూచించారు మంత్రి రోజా.


పథకాలు వైఎస్ తెచ్చారని రజనీకాంత్ తెలుసుకోవాలన్న రోజా             


 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రియింబర్స్‌మెంట్‌ తెచ్చింది వైఎస్సార్.. చంద్రబాబు కాదని హితవుపలికారు మంత్రి రోజా.. చంద్రబాబు విజన్‌ 2020 వల్ల టీడీపీ 23 సీట్లకు పరిమితమైందని ఎద్దేవా చేశారు.  విజన్‌ 2047కి చంద్రబాబు ఏ దశలో ఉంటారో రజనీకాంత్‌కి తెలుసా..? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ శతజయంతి వేదికగా చేసిన కామెంట్లతో రజనీకాంత్‌పై తెలుగు ప్రజలకు ఉన్న గౌరవం తగ్గించుకున్నారని విమర్శించారు.  ఇంతలా మాట్లాడేవారు 27 ఏళ్లలో ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇప్పించలేదని ప్రశ్నించారు.  ఎన్టీఆర్‌ యుగపురుషుడు అన్న వారు ఎందుకు వెన్నుపోటు పొడిచారు?. అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రజనీకాంత్‌ చెప్పినట్టు 2024లో చంద్రబాబు సీఎం అయ్యే అవకాశమే లేదని జోస్యం చెప్పారు . 


రజనీకాంత్ ఏమన్నారంటే ?                                                   


విజయవాడలో జరిగిన నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలకు   రజనీకాంత్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  టీడీపీ అధినేత చంద్రబాబు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.  చంద్రబాబు తనకు 30 ఏళ్లుగా మిత్రుడని.. చంద్రబాబు ఐటీ విజన్‌ ఏంటో ప్రపంచానికి తెలుసన్నారు.  గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడని అప్పుడే అనుకున్నాను. చంద్రబాబు పెద్ద విజనరీ.. చంద్రబాబు విలువ ఇక్కడ ఉన్నవాళ్లకంటే.. బయట ఉన్న వాళ్లకే తెలుసు. ఎప్పుడూ అభివృద్ధి గురించే చంద్రబాబు మాట్లాడేవారన్నారు.  హైదరబాద్ అభివృద్ధి అవ్వడంతో చంద్రబాబు పాత్ర ఎంతో ఉంది. ప్రస్తుతం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు. చంద్రబాబు విజన్ 2047 సాకారం అవుతుందని రజనీకాంత్‌ వ్యాఖ్యానించారు. దీనిపై వైఎస్ఆర్‌సీపీ నేతలు మండి పడుతున్నారు.