వాతావరణం  వేడిగా ఉన్నప్పుడు చెమటలు పట్టడం సహంజ. వాతావరణ చల్లగా ఉన్నప్పుడు కూడా శారీరక శ్రమ పడినప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు చెమటలు పడతాయి. అది కూడా సహజమే. కానీ ఏ పని చేయకుండా కూర్చున్నా కూడా చల్లని వాతావరణంలో చెమటలు పడుతుంటే దాన్ని తీవ్రంగా పరిగణించాలి. తేలికగా తీసుకోకూడదు. ఇలా చెమటలు పట్టడం అంతర్లీనంగా దాగి ఉన్న ఏదైనా  ఆరోగ్య సమస్య లక్షణంగా చెప్పుకోవచ్చు.  


ఆరోగ్య నిపుణుల చెబుతున్న ప్రకారం, అధిక చెమటలు పట్టడాన్ని డయాఫోరెసిస్ అని పిలుస్తారు. ఇది ఒక వైద్య పరిస్థితి. డయాఫోరేసిస్‌లో తీవ్ర స్థాయిని సెకండరీ హైపర్‌హైడ్రోసిస్ అని పిలుస్తారు. అరచేతులు,పాదాలకే కాకుండా మొత్తం శరీరానికి చెమటపట్టేస్తుంది. ఇది ప్రాణాపాయ అనారోగ్యాన్ని సూచిస్తుంది. 


లక్షణాలు 
హార్వర్డ్ హెల్త్ ప్రకారం, నిద్రపోతున్నప్పుడు కూడా డయాఫోరేసిస్ సమస్య ఇబ్బంది పెడుతుంది. ఎక్కువగా ఇది యుక్తవయసులో ప్రారంభమవుతుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే...


1. విపరీతమైన చెమట
2. గుండె వేగంగా కొట్టుకోవడం
3. చేతుల్లో చెమట పట్టడం
4. మానసిక ఆందోళన
5. బరువు తగ్గడం
6. తలతిరగడం
7. మసకబారిన చూపు
8. విపరీతమైన అలసట


డయాఫోరేసిస్‌ ఎందుకు వస్తుంది?
ఈ సమస్య రావడానికి చాలా కారణాలు  ఉన్నాయి. 


మెనోపాజ్
స్లీప్ ఫౌండేషన్ ప్రకారం, దాదాపు 85 శాతం మంది మహిళలు మెనోపాజ్, పెరిమెనోపాజ్ సమయంలో చెమటలు, వేడి ఆవిర్లు కలుగుతాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్లలో హెచ్చుతగ్గుల వల్ల శరీరం వేడెక్కినట్టు అవుతుంది. ఇది మీ మెదడుకు తప్పుడు సంకేతాలను పంపుతుంది. దీని వల్ల అధిక చెమట, రాత్రి చెమటలు పట్టడం వంటివి జరుగుతాయి.


మధుమేహం
మధుమేహంతో బాధపడేవారికి, చెమటలు పడితే రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నట్లు అర్థం. అప్పుడు ఏదైనా తీపి పదార్థం తినడం ద్వారా మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడం చాలా ముఖ్యం. 


హైపర్ థైరాయిడిజం
హైపర్ థైరాయిడిజంలో  అధిక థైరాక్సిన్ ఉత్పత్తి అవుతుంది. అప్పుడు  అధిక చెమటను కలిగిస్తుంది. ఇది జరిగినప్పుడు, మీ జీవక్రియ వేగవంతం అవుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. నిద్రలేమి, గుండెపోటు కలగవచ్చు. ధమనుల్లో ఏదైనా అడ్డుపడడం వల్ల గుండె పోటు సంభవించే అవకాశం ఉంది. అప్పుడు అధికంగా చెమటలు పడతాయి. 


క్యాన్సర్
లింఫోమా, లుకేమియా, ఎముక క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్లలో, డయాఫోరేసిస్ అనేది ఒక సాధారణ లక్షణం. క్యాన్సర్ చికిత్స వల్ల కూడా అధిక చెమట పట్టే అవకాశం ఉంది. 


మద్యం మానేస్తే..
డ్రగ్స్, ఆల్కహాల్ ను హఠాత్తుగా మానేసినా కూడా ఇలా శరీరానికి చెమటలు పట్టే అవకాశం ఉంది. ఇలా జరిగితే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. లేకుంటే పరిస్థితులు ప్రాణాంతకంగా మారుతాయి. 


అలర్జీలు
అలెర్జీలు కలిగినప్పుడు కూడా ఇలా చెమట పడుతుంది. ఏదైనా పడని పదార్థం శరీరంలోకి వెళ్లిన వెంటనే ప్రతి చర్యగా మన శరీరానికి చెమటలు పడతాయి. అప్పడు వైద్య సాయం తీసుకోవాలి. 


Also read: పని ఒత్తిడి వల్ల పురుషులతో పోలిస్తే మహిళలకే ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశం































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.