Balineni :  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చారు పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలకు రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.  .  చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా ఉన్న బాలినేని.. తనకు ఆ బాధ్యతలు వద్దని పార్ట అధ్యక్షుడిగా స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం   హైదరాబాద్‌లో ఉన్న  బాలినేనిని సంప్రదించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే అనారోగ్యంతో ఉన్నానని డిస్టర్బ్ చేయవద్దని ఆయన అంటున్నట్లుగా సన్నిహితులు చెబుతున్నారు.  ఆయన రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలినట్టు అయ్యింది.                         


సీఎం వైఎస్ జగన్‌ తొలి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన బాలినేనికి తర్వాత ఉద్వాసన పలికారు.  ఆ తర్వాత పార్టీ బాధ్యతలను అప్పగించారు.. కొన్ని సందర్భాల్లో మినహా.. పార్టీ కార్యక్రమాలు యాక్టివ్‌గా ఉన్న బాలినేని ఉన్నట్టుండి ఇప్పుడు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇటీవలి కాలంలో ఆయనకు వైసీపీలో ప్రాధాన్యం దక్కడం లేదు. ప్రోటోకాల్ కూడా లభించడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకే చెందిన మరో మంత్రి ఆదిమూలం సురేష్‌తో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తనను తొలగించి ఆయనను మంత్రిగా కొనసాగించడంపై బాలినేని .. తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. దానికి తోడు పార్టీ వ్యవహారాల్లో అసలు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని ఫీలవుతున్నారు.                                              


ఇటీవల ప్రకాశం జిల్లా మార్కాపురం సీఎం జగన్ పర్యటనలో  బాలినేని శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. బాలినేనికి ప్రొటోకాల్‌లో ప్రాధాన్యత ఇవ్వలేదు అధికారులు. మార్కాపురంలో సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు హెలిప్యాడ్‌ వద్దకు వెళ్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి వాహనాలను అధికారులు అడ్డుకున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలినేని… అక్కడి నుంచి వెళ్లిపోయారు.   సీఎం కార్యక్రమంలో పాల్గొనకుండానే తన అనుచరులతో ఆయన ఒంగోలుకు వెనుదిరిగారు. విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు సీఎంవో అధికారులు. సీఎం కలుగచేసుకుని వెనక్కి రప్పించారు. ఆయనతోనే బటన్ నొక్కించారు. 


కానీ పరిస్థితులు మెరుగుపడలేదని స్పష్టమయింది. పార్టీ వ్యవహారాల్లో తనను రోజు రోజుకు పక్కన పెడుతూండటం.. కనీసం ప్రోటోకాల్ కూడా లభించకపోతూండటంతో చివరికి తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లుగాచెబుతున్నారు. అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నాయకుడు.. ఆయన గౌరవానికి ఎలాంటి భంగం ఉండదంటున్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు.. ఆయనతో పార్టీ నేతలు మాట్లాడుతారు.. ఇదంతా టీ కప్పులో తుఫాన్ లాంటిదే అంటున్నారు. బాలినేని గతంలో జనసేనలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారాన్ని బాలినేని తీవ్రంగా ఖండించారు.