Air India Flight:
తాగిన మత్తులో..
అమెరికా నుంచి ఢిల్లీకి వచ్చే Air India ఫ్లైట్‌లో ఓ ప్రయాణికుడు మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటన సంచలనమైంది. నిందితుడిపై కేసు నమోదు చేశారు. గతేడాది నవంబర్ 26 న ఈ ఘటన జరగ్గా...ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిర్ ఇండియా అధికారులు చెప్పిన వివరాల ప్రకారం..ఈ కేసు విచారణకు అంతర్గత కమిటీని ప్రత్యేకంగా నియమించారు. "ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశాం. అంతే కాదు. ఆ నిందితుడిని "No Fly" జాబితాలో చేర్చాలని ప్రతిపాదించాం. దీనిపై నిర్ణయం ప్రభుత్వానిదే. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఎదురు చూస్తున్నాం" అని వెల్లడించారు. బిజినెస్ క్లాస్‌లో ఈ ఘటన జరిగినట్టు వివరించారు. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఇలా అసభ్యంగా ప్రవర్తించినట్టు చెప్పారు. ప్రస్తుతానికి కేసు విచారణలో ఉంది. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే...ఈ మధ్య కాలంలో విమానాల్లో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. ప్రయాణికులు గొడవపడటం, సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించడం లాంటివి తరచూ వెలుగులోకి వస్తున్నాయి.
ప్రయాణికుల గొడవ..
బ్యాంకాక్ నుంచి ఇండియాకు వచ్చే స్మైల్ ఎయిర్‌వేస్ ఫ్లైట్‌లో ఇద్దరు ఇండియన్స్ ఘర్షణకు దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాటలతో మొదలైన గొడవ..చివరకు పిడిగుద్దుల వరకూ వెళ్లింది. ఇద్దరూ చాలా సేపు వాగ్వాదం జరిగాక...ఉన్నట్టుండి ఓ నలుగురు వచ్చి ఒక వ్యక్తిపై దాడికి దిగారు. ముఖంపై ఇష్టమొచ్చినట్టు కొట్టారు. ఫ్లైట్ సిబ్బంది వాళ్లను ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. దయచేసి ఆపేయండి అంటూ మైక్రోఫోన్‌లో క్రూ మెంబర్స్ అనౌన్స్ చేసినా పట్టించుకోకుండా దాడి చేశారు. మిగతా ప్రయాణికులంతా అలాగే చూస్తూ ఉండిపోయారు. కాసేపటికి తేరుకుని వాళ్లను ఆపేందుకు ప్రయత్నించినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. ఆ ఫ్లైట్‌లోని ప్రయాణికుడు ఈ గొడవనంతా వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. క్షణాల్లో ఇది వైరల్ అయిపోయింది. అసలు గొడవకు కారణమేంటని ఆరాతీస్తే...ఓ సీట్ విషయంలోనే వాళ్లు అంతగా ఘర్షణ పడ్డారని తేలింది. టేకాఫ్ సమయంలో విమానంలోని సిబ్బంది ముందస్తు జాగ్రత్తగా సీట్స్‌ను అడ్జస్ట్ చేసుకోవాలని సూచించింది. అయితే...ఓ ప్రయాణికుడు అందుకు అంగీకరించలేదు. తనకు నడుము నొప్పి ఉందని చెప్పాడు. సీట్‌ను పూర్తిగా వెనక్కి జరిపి రిక్లైనర్‌గా మార్చేశాడు. వెనక ఉన్న ప్రయాణికుడు దీనిపై సీరియస్ అయ్యాడు. టేకాఫ్ సమయంలో సీట్ ఇలా ఉంటే ప్రమాదమని, పైకి అనుకోవాలని సిబ్బంది చెప్పినా ఆ వ్యక్తి వినిపించుకోలేదు. ఈ విషయంలో మాట మాట పెరిగి ఆ ప్రయాణికులు ఇద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. దీనిపై ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. ఈ ఇద్దరిపైనా కేసు నమోదు చేసినట్టు ట్వీట్ చేశారు.