Drugs Caught in Gujarat: ఇండియన్ కోస్ట్ గార్డ్ భారీ యాంటీ డ్రగ్ ట్రాఫికింగ్ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగానే గుజరాత్ తీర ప్రాంతంలో రూ.600 కోట్ల విలువ చేసే 86 కిలోల డ్రగ్స్‌ని స్వాధీన చేసుకుంది. 14 మంది పాకిస్థాన్‌కి చెందిన అనుమానితులను అదుపులోకి తీసుకుంది. Anti-terrorism Squad (ATS) ఈ ఆపరేషన్‌ చేపట్టింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కూడా ఈ ఆపరేషన్‌లో పాలు పంచుకుంది. ఓ పడవలో ఈ డ్రగ్స్‌ని తీసుకొస్తున్నట్టుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు అధికారులు. అర్ధరాత్రి ఈ ఆపరేషన్‌ నిర్వహించి ఈ ముఠాని పట్టుకున్నారు. ఈ మిషన్‌లో భాగంగా భారీ ఓడలతో పాటు ఓ ఎయిర్‌క్రాఫ్ట్‌నీ సిద్ధం చేసుకుంది ఇండియన్ కోస్ట్ గార్డ్. వీళ్ల నిఘా కళ్లలో పడగానే నిందితులు తప్పించుకుని పోయేందుకు ప్రయత్నించారు. కానీ కోస్ట్ గార్డ్ టీమ్‌ వాళ్లు ఎటూ తప్పించుకోకుండా చుట్టుముట్టింది. పాకిస్థాన్ పౌరులతో పాటు ఆ పడవనీ పోరబందర్‌కి తరలించి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. 


"అర్ధరాత్రి ఈ ఆపరేషన్ చేపట్టాం. యాంటీ నార్కోటిక్స్‌ నిఘా వర్గాలు అందించిన సమాచారం ప్రకారం గుజరాత్ తీర ప్రాంతంలో పహారా కాశాం. ఆ సమయంలోనే పాకిస్థాన్ నుంచి వచ్చిన ఓ పడవను స్వాధీనం చేసుకున్నాం. అందులో 86 కిలోల డ్రగ్స్‌ని గుర్తించి సీజ్ చేశాం. పాకిస్థాన్‌కి చెందిన 14 మందిని అదుపులోకి తీసుకున్నాం"


- ఇండియన్ కోస్ట్‌ గార్డ్