Drones in India-Pak Border:


జాయింట్ ఆపరేషన్..


భారత్, పాక్ సరిహద్దుల్లో తరచుగా డ్రోన్‌లు కలకలం రేపుతున్నాయి. వాటిలో డ్రగ్స్‌ని సరఫరా చేస్తున్నాయి కొన్ని ముఠాలు. సరిహద్దులోని భారత సైనిక బలగాలు వీటిని పసిగట్టి స్వాధీనం చేసుకుంటున్నాయి. ఇప్పుడు పంజాబ్‌లోని టర్న్ టరన్ జిల్లాలో డ్రగ్స్‌తో ఉన్న డ్రోన్‌ను గుర్తించారు. పంజాబ్ పోలీసులు, బీఎస్‌ఎఫ్ బలగాలు జాయింట్ ఆపరేషన్‌లో ఈ డ్రోన్‌ను రికవరీ చేసుకున్నారు. ఇందులో మూడు కిలోల హెరాయిన్‌ను గుర్తించారు. "స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా సరిహద్దు ప్రాంతాలపై నిఘా పెంచాం. టర్న్ టరన్ పోలీసులు, బీఎస్‌ఎఫ్ బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఓ క్వాడ్‌కాప్టర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో మూడు కిలోలహెరాయిన్‌ను కనుగొన్నాం" అని డీజీపీ గౌరవ్ యాదవ్ ట్వీట్ చేశారు. ఇంతకు ముందు రోజే...బీఎస్‌ఎఫ్ బలగాలు ఫజిల్కా జిల్లాలో డ్రోన్ ద్వారా తరలిస్తున్న 25 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వారంలో వరుసగా పాకిస్థాన్ నుంచి డ్రోన్‌లు భారత్‌వైపు దూసుకొచ్చాయి. ఓ సారి 5 కిలోల హెరాయిన్, మరోసారి 10 కిలోల హెరాయిన్‌ అందులో కనిపించింది. దీనిపై కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ స్పందించారు. "బీఎస్ఎఫ్ బలగాలు సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాయి. డ్రగ్స్‌ సరఫరా ఎంతగా అరికడుతున్నా...అదో సవాలుగా మారుతోంది. కొన్ని సార్లు ఆయుధాలనూ డ్రోన్‌ల ద్వారా తరలిస్తున్నారు" అని వెల్లడించారు. 


డ్రోన్‌లపై గద్దల పోరాటం..


భారత్, పాక్ సరిహద్దు ప్రాంతాల్లో పదేపదే డ్రోన్‌ల కలకలం రేగుతోంది. దీనిపై భారత్ వ్యూహం మార్చింది. శత్రుదేశం నుంచి వచ్చే డ్రోన్‌ల ఆట కట్టించేందుకు కొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. గద్దలకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి ఆ డ్రోన్‌లను గాల్లోనే ధ్వంసం చేయనున్నారు. 
ఇప్పటికే నెదర్లాండ్స్, ఫ్రాన్స్‌ ఈ వ్యూహాన్ని అనుసరిస్తుండగా..ఇప్పుడా జాబితాలో భారత్ కూడా చేరింది. భారత్, అమెరికా జాయింట్ మిలిటరీ ఎక్సర్‌సైజ్‌ "యుద్ధ్ అభ్యాస్"లో భాగంగా...ఉత్తరాఖండ్‌లో ఈ శిక్షణ కొనసాగుతోంది. దాదాపు 15 రోజుల పాటు ఈ విన్యాసాలు జరగనున్నాయి. 
సైన్య వ్యూహాలను ఇరు దేశాలూ ఇచ్చి పుచ్చుకుంటాయి. విపత్కర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి..?  అనేదీ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటారు. సరిహద్దు ప్రాంతాల నుంచి డ్రోన్‌లు వస్తుంటే..వాటిని ముందుగానే పసిగట్టే విధంగా గద్దలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. భారత్, పాకిస్థాన్ 
మధ్య దాదాపు 3 వేల కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్ము...ఈ సరిహద్దుకి దగ్గరగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో డ్రోన్‌లు తరచుగా కనిపించాయి. డ్రగ్స్‌ను పెద్ద ఎత్తున సరఫరా చేస్తూ ఇవి కంటపడ్డాయి. బీఎస్‌ఫ్ బలగాలు వీటిని గుర్తించి నిర్వీర్యం చేశారు. అయితే...తరచూ ఇదే సమస్య ఎదురవుతుండటం వల్ల పూర్తి స్థాయిలో దీనికి పరిష్కారం కోసం పక్షులను రంగంలోకి దింపారు. సైన్యాలు పక్షులను వినియోగించడం ఇదే తొలిసారి కాదు. ప్రపంచ యుద్ధాల సమయంలో పావురాలను వినియోగించేవారు. జర్మన్లు డేగలను వాడే వారు. 


Also Read: Indian Navy Day 2022: మీ ధైర్యసాహసాలు చూసి దేశం గర్వపడుతోంది - ఇండియన్ నేవీకి పీఎం మోడీ శుభాకాంక్షలు