Bulletproof Jacket: రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత సాధించే దిశగా అడుగులు వేస్తున్న భారత్ కీలక ఆయుధాలను దేశీయంగా తయారు చేసుకుంటోంది. కొన్ని రకాల మిజైల్స్ కూడా ఇక్కడే తయారవుతున్నాయి. DRDO ఇందుకు ఎంతగానో కృషి చేస్తోంది. ఇప్పుడిదే సంస్థ మరోసారి తన సామర్థ్యాన్ని చాటుకుంది. తక్కువ బరువున్న బులెట్ ప్రూఫ్ జాకెట్‌ని (DRDO bulletproof jacket) తయారు చేసింది. ఎంత తీవ్రంగా దాడి జరిగినా ఆ వ్యక్తికి ఏమీ కాకుండా ప్రాణాలు కాపాడుతుంది ఈ జాకెట్. అంత పటిష్ఠంగా దీన్ని రూపొందించింది. ప్రమాద తీవ్రతను కొలిచే Threat level 6 నీ తట్టుకుని ఈ జాకెట్ సమర్థంగా పని చేస్తుందని DRDO స్పష్టం చేసింది. కాన్‌పూర్‌లోని Defence Materials and Store Research and Development సంస్థ ఈ జాకెట్‌ని తయారు చేసింది. ఈ లైట్ వెయిట్ జాకెట్‌ని ఛండీగఢ్‌లోని టర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబరేటరీలో విజయవంతంగా పరీక్షించినట్టు తెలిపారు డీఆర్‌డీవో అధికారులు. పాత డిజైన్స్‌ని పక్కన పెట్టి పూర్తిగా కొత్త డిజైన్‌లో దీన్ని రూపొందించారు.
స్పెషాల్టీ ఏంటి..?
ఈ బులెట్ ప్రూఫ్ జాకెట్ స్పెషాల్టీ ఏంటంటే ఓ స్నైపర్ నుంచి వరసగా 6 బులెట్‌లు వచ్చి తాకినా ఆ వ్యక్తిని రక్షిస్తుంది. అందుకు కారణం..ఈ జాకెట్ ముందు భాగంలో ఉండే Hard Armour Panel (HAP).మోనోలిథిక్ సెరామిక్ ప్లేట్ (monolithic ceramic plate)తో పాటు పాలిమర్‌తో దీన్ని తయారు చేశారు. ధరించినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా డిజైన్ చేశారు. అయితే...ఈ లైట్‌వెయిట్ బులెట్ ప్రూఫ్ జాకెట్‌ల తయారీ గురించి గతంలోనే కొందరు అధికారులు హింట్ ఇచ్చారు. ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోని హెలికాప్టర్ సిబ్బందికి ఈ బులెట్ ప్రూఫ్ జాకెట్‌లనే అందించనున్నారు. ఆపరేషన్స్‌లో పాల్గొన్న సమయంలో బరువైన జాకెట్స్ ఉండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు. అందుకే వాటి బరువు తగ్గించి కొత్తగా వీటిని డిజైన్ చేశారు. ఆపరేషన్స్‌లో పాల్గొనే సమయంలో బులెట్ ప్రూఫ్ జాకెట్ బరువు 4 కిలోలకు మించి ఉండకూడదని IAF వెల్లడించింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని DRDO రూపొందించింది.