Donald Trump:
2020 ఎన్నికలపై అసహనం..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తానని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఎప్పుడూ ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే ట్రంప్...ఈ సారి ఏకంగా అమెరికా రాజ్యాంగానికే గురి పెట్టారు. అమెరికా రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. 2020లో జరిగిన ఎన్నికలను "పెద్ద మోసం" అంటూ విమర్శించారు. ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ వెనకబడింది. ట్రంప్ మద్దతుతో బరిలోకి దిగినప్పటికీ..పెద్దగా ప్రయోజనం లేకుండా
పోయింది. ఫలితంగా...సెనేట్‌పై డెమొక్రట్లదే పై చేయి అయింది. దీన్ని ఉద్దేశిస్తూనే ట్రంప్ ఇలా అసహనం వ్యక్తం చేశారు. అంతే కాదు. 2020లో జరిగిన ఎన్నికలపై ట్రంప్ విమర్శలు చేయడానికి ఇటీవల జరిగిన ఓ పరిణామమూ కారణమే. న్యూయార్క్ పోస్ట్ పత్రిక ఇటీవలే ఓ కథనం రాసింది. 2020లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ అంతా బైడెన్ ల్యాప్‌టాప్‌లో ఉందని పేర్కొంది. అంతర్గత ట్విటర్ ఈమెయిల్స్ కూడా విడుదల చేసింది. "ఇలాంటి భారీ మోసాలు...అన్ని రూల్స్‌ని, నిబంధనలను, రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ని రద్దు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. మొత్తం రాజ్యాంగాన్నే రద్దు చేయాల్సిన పరిస్థితులు తీసుకొస్తున్నాయి" అని అన్నారు ట్రంప్. Truth Social అనే సోషల్ నెట్‌వర్క్‌లో ఈ పోస్ట్ చేశారు. దీనిపై రిపబ్లికన్ పార్టీకి చెందిన లిజ్ చెనే ట్రంప్‌పై విమర్శలు చేశారు. "నిజాయతీ ఉన్న ఏ వ్యక్తి కూడా..ట్రంప్ రాజ్యాంగ వ్యతిరేకి అన్న నిజాన్ని అంగీకరించకుండా ఉండలేరు" అని ట్వీట్ చేశారు.
పోటీ చేస్తానని ప్రకటన..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయనున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కడ సభలు జరిగినా ఈ హింట్ ఇస్తూనే ఉన్నారు ట్రంప్. ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. ఈ సారి ఎన్నికల్లో జో బైడెన్‌తో పోటీ పడనున్నారు. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం వరుసగా ఇది మూడోసారి. తన పోటీ గురించి అధికారిక ప్రకటన చేసిన ట్రంప్...తన ప్రచారంలో మార్పులు చేయనున్నట్టు చెప్పారు. గతంలో కన్నా ఈ సారి కాస్త విభిన్నంగా క్యాంపెయినింగ్ చేయాలని భావిస్తున్నట్టు వివరించారు. "అమెరికాను ప్రపంచంలోనే గొప్ప దేశంగా నిలబెట్టాలి. అగ్రరాజ్యంగా మళ్లీ వెలిగిపోవాలి" అని అన్నారు. ఇటీవల మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమికి కారణం...ట్రంపేనని అంతా విమర్శించారు. కానీ...అవేవీ పట్టించుకోకుండా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలని సిద్ధపడుతున్నారు ట్రంప్. చివరిసారి 2020లో అమెరికాకు అధ్యక్ష ఎన్నికలు జరగ్గా...బైడెన్‌తో పోటీ పడిన ట్రంప్..ఓటమి పాలయ్యారు. అయినా..ఆయన ఓటమిని ఒప్పుకోలేదు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈసారి బైడెన్‌కు ప్రజలు మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదని చాలా ధీమాగా చెబుతున్నారు. లక్షలాది మంది అమెరికన్లను బైడెన్ అసహనానికి గురి చేశారని విమర్శిస్తున్నారు. అమెరికాకు ఐడెంటిటీ లేకుండా పోయిందని మండి పడ్డారు.
Also Read: Harish Rawat on POK: మోదీజీ, ఇదే సరైన టైమ్- పీఓకేను లాగేసుకోండి: మాజీ సీఎం