కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో గల తిమ్మాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. సెయింట్ ఆంథోనీ స్కూల్‌ సమీపంలోని బావిలో చెత్త తొలగించేందుకు వెళ్లిన ఎనిమిదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. శ్రీకర్ అనే విద్యార్థిని ఇతర విద్యార్థులతో వార్డెన్ చెప్పడంతో బావిలోకి దిగి ప్రాణాలు కోల్పోయాడు. 


అసలేం జరిగింది?


ఆదివారం కావడంతో పాఠశాల ఆవరణంలో ఉన్న బావిని శుభ్రం చేయాలని విద్యార్థులకు చెప్పాడు హాస్టల్ వార్డెన్. దీంతో మరో ఆరుగురు విద్యార్థులతో కలిసి శ్రీకర్ బావిలోకి దిగాడు. అందులో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగిస్తూ ఉండగా అదుపుతప్పి నీటిలో మునిగిపోయాడు. ఈత రాకపోవడంతో పాటు సాయంత్రం సమయం కావడంతో ఊపిరాడక నీటిలో మునిగి చనిపోయాడు. 


అప్రమత్తమైన స్థానికులు వెంటనే రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో బావిలోకి దిగిన రక్షణ సిబ్బంది తాడుతో విద్యార్థి మృతదేహాన్ని బయటకు లాగారు. రెండు మూడు వారాలకు ఒకసారి పాఠశాల ఆవరణలో ఉన్న ప్రమాదకరమైన ఈ బావిలోని క్లీనింగ్‌ను పిల్లలతో చేయిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నవీన్ ,శశాంక్ ,లక్ష్మీ నివాస్, హరీష్ రెడ్డి, శ్రీకర్ అనే విద్యార్థులకు ఈ పనిని వార్డెన్ పురమాయించారు. అయితే సమయానికి ఎవరు రక్షించే పరిస్థితి లేకపోవడంతో  నీటిలో మునిగాడు.


మారం శ్రీకర్ స్వగ్రామం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుంట గ్రామం. అతని తల్లిదండ్రులు శ్రీనివాస్, రాధా. శ్రీకర్ తండ్రి శ్రీనివాస్ ప్రస్తుతం హైదరాబాదులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. రామకృష్ణ కాలనీలో తాత అమ్మమ్మ ఉంటారు. ఈ సంవత్సరమే సెయింట్ ఆంథోనీ పాఠశాలలో హాస్టల్లో ఉంచి శ్రీకర్‌ను చదివిస్తున్నారు. ఇప్పుడు ఈ బాలుడి మృతి అతడి తల్లిదండ్రులు, చెల్లి తీవ్రంగా రోదిస్తున్నారు.


స్కూల్ పిల్లలతో ప్రమాదకరమైన పనులు చేయించడం మంచిది కాదని తెలిసిన వార్డెన్ నిర్లక్ష్యం వల్ల ఒక కుటుంబం తమ ఇంటి దీపాన్ని కోల్పోయిందని స్థానికులు అంటున్నారు. జరిగిన ఘటన పట్ల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువుకోవాలని పంపిస్తే ప్రమాదకరమైన పనులు చేస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో వార్డెన్‌ని అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్‌కి తరలించారు.


స్కూల్లోనే ధర్నా..


పూర్తిగా యజమాన్యం నిర్లక్ష్యంతోని విద్యార్థి చనిపోవడంతో అక్కడి నుంచి మృతదేహం తీసేది లేదని బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులతో తిమ్మాపూర్ సిఐ శశిధర్ రెడ్డి ఎల్ఎండిఎస్ఐ ప్రమోద్ రెడ్డి మాట్లాడి నిందితునికి కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఎంపీడీవో రవీందర్ రెడ్డి ఎంఈఓ శ్రీనివాసరెడ్డి ఎంపీ ఓ కిరణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని సదరు పాఠశాల యజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ హామీలతో శాంతించిన బంధువుల రాత్రి 10 గంటల సమయంలో విద్యార్థి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.