Killer Wolves in UP: యూపీలోని బహరిచ్ జిల్లాలో తోడేళ్లు వణుకు పుట్టిస్తున్నాయి. ఇప్పటి వరకూ 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో ఏడుగురు చిన్నారులే ఉన్నారు. దాదాపు 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తాయో అని భయపడుతున్నారు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి. రంగంలోకి అటవీ అధికారులు ఆ తోడేళ్లను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. మొత్తం ఆరు తోడేళ్లు దాడులు చేస్తున్నట్టు గుర్తించారు. వీటిలో నాలుగింటిని ఇప్పటికే బంధించారు. Operation Bhediya పేరుతో ఈ ఆపరేషన్ చేపడుతున్నారు. మరో రెండు తోడేళ్ల ఆచూకీ ఇంకా దొరకలేదు.






ఫలితంగా స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వీటిని పట్టుకునేందుకు అధికారులు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే పిల్లల బొమ్మలను ఉపయోగించి వాటిని బంధించేందుకు ప్లాన్ చేస్తున్నారు. చిన్నారుల యూరిన్‌లో బొమ్మలు వేసి వాటి ద్వారా తోడేళ్లను పట్టుకోవాలని చూస్తున్నారు. పిల్లలనే ఎక్కువగా టార్గెట్ చేసుకుని చంపుతున్నట్టు గుర్తించారు. అందుకే పిల్లల బొమ్మలతోనే వాటిని బంధించాలని చూస్తున్నట్టు అటవీ అధికారులు వెల్లడించారు. 


"తోడేళ్లు పిల్లలపైనే దాడి చేస్తున్నాయి. వాళ్లనే చంపుతున్నాయి. అందుకే పిల్లల బొమ్మలకు రంగురంగుల దుస్తులు వేసి ఓ చోట పెడుతున్నాం. చిన్నారుల యూరిన్‌తో ఆ బొమ్మలను తడుపుతున్నాం. అక్కడ ఎవరో మనిషి ఉన్నట్టుగా సీన్ క్రియేట్ చేస్తున్నాం. మనిషి వాసన వస్తే తోడేళ్లు వెంటనే అక్కడికి వస్తాయి. అందుకే ఇదంతా చేస్తున్నాం. ఈ విధంగా వాటిని బంధించాలని చూస్తున్నాం"


- అటవీ అధికారులు






థర్మల్ డ్రోన్స్‌తో తోడేళ్ల వేట..


థర్మల్ డ్రోన్స్‌ వినియోగించి తోడేళ్ల ఆచూకీ కనిపెడుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆ డ్రోన్స్‌తో వాటిని వెంటాడి ఓ చోటకు తీసుకొచ్చి అక్కడ బంధిస్తున్నట్టు తెలిపారు. కొన్ని చోట్ల టపాకులు కాల్చి,పెద్ద పెద్ద శబ్దాలు చేసి వాటిని భయపెడుతున్నట్టు వివరించారు. మరి కొన్ని చోట్ల భారీ టెడ్డీబేర్‌లను వినియోగించి వాటిని ట్రాప్ చేస్తున్నారు. ఏనుగు వ్యర్థాలను కాల్చుతున్నట్టు చెబుతున్నారు అధికారులు. ఏనుగులంటే తోడేళ్లకు భయమని, జనావాసాల నుంచి వాటిని వెళ్లగొట్టడానికి ఇలా చేస్తున్నామని అంటున్నారు. ఎవరూ లేని చోట మారు మూల ప్రాంతాల్లో వాటిని బంధిస్తున్నారు. 


Also Read: Kolkata: నేను వెళ్లే సరికే రక్తపు మడుగులో ఉంది, భయంతో బయటకు వచ్చాను - నిందితుడి సంచలన వ్యాఖ్యలు