DMK MP Raja Who Made Sensational Comments Saying That India Was Never One Country : డీఎంకే ఎంపి ఏ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఎప్పుడూ ఒక దేశం కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. డీఎంకే ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ పార్టీ ఎంపీ రాజా మాట్లాడుతూ ఆస క్తికరమైన అంశాన్ని లేవనెత్తారు. భారత్ ఎప్పుడూ ఒక దేశం కాదని పేర్కొన్న రాజా.. భిన్న సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమైన భారత్ ఉపఖండమంటూ పేర్కొన్నారు.
రాజా చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో దుమారం రేగుతోంది. భారతీయ జనతా పార్టీ డీఎంకే చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ద్వజమెత్తుతోంది. గతంలో రాజా రాముడు గురించి మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తోంది. రాముడి గురించి తప్పుగా మాట్లాడారని, వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ. రాజా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. రాజా వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదంటూ స్పష్టం చేసిన కాంగ్రెస్ పార్టీ.. వాటిని ఖండిస్తున్నామంటూ పేర్కొంది.
డీఎంకే ఎంపీ రాజా ఏమన్నారంటే
డీఎంకే ఎంపీ రాజా ఆ పార్టీ నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలను చేశారు. ఆ వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో వివాదం చెలరేగుతోంది. రాజా మాట్లాడుతూ భారత్ ఒక దేశం కాదని, ఎప్పుడూ ఒక దేశంగా లేదన్నారు. ఒకే భాష, ఒకే సాంప్రదాయం, ఒకే సంస్కృతి వంటి లక్షణాలుంటే ఒకే దేశమంటారని, కానీ, భారత్ అలా కాదని రాజా పేర్కొన్నారు. భిన్న భాషలు, విభిన్న సంస్కృతులున్న రాష్ట్రాలు కలిసి దేశంగా ఏర్పడ్డాయన్న రాజా.. అందుకే ఇది దేశం కాదు.. ఉప ఖండం అంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందని వివరించారు.
తప్పుబడుతున్న బీజేపీ
డీఎంకే ఎంపీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబడుతోంది. డీఎంకే నుంచి ఇటువంటి విద్వేష ప్రసంగాలు వస్తూనే ఉన్నాయంటూ బీజేపీ ఆరోపిస్తోంది. సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వివాదం ముగియకముందే.. మరో నేత అదే తరహాలో మాట్లాడడం దారుణమని బీజేపీ ఆక్షేపించింది. దీనిపై కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పక్షాలు ఎందుకు మౌనంగా ఉన్నాయంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే ఈ తరహా మాటలు, వ్యాఖ్యలను మానుకోవాలని బీజేపీ కోరింది. ఇదిలా ఉంటే డీఎంకే ఎంపీ రాజా వ్యాఖ్యలు, బీజేపీ విమర్శలు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. రాజా చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ సమాధానాన్ని ఇచ్చారు. వాటితో వందశాతం ఏకీభవించడం లేదంటూ ఆమె స్పష్టం చేశారు. రాజా వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఎవరైనా, ఏదైనా మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని ఆమె కోరారు.
ఏది ఏమైనా రాజా చేసిన వ్యాఖ్యలతో మరోసారి వివాదం రేగినట్టు అయింది. బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా రాజా మాట్లాడిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. ద్వేషపూరిత ప్రసంగంలో భారతదేశం ఔన్నత్యాన్ని ప్రశ్నించే రీతిలో వ్యవహరిస్తున్నారంటూ పేర్కొన్నారు.