International Womens Day 2024 Special: వ్యాపారాలు, పరిశ్రమల ఏర్పాటు వైపు మహిళలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. కొన్ని బ్యాంక్‌లు కూడా వివిధ పథకాల కింద తక్కువ వడ్డీ రేటుకు రుణాలు అందిస్తున్నాయి. అంతేకాదు, మహిళల పొదుపు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాలపై ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నాయి.


మహిళల కోసం అమలవుతున్న ప్రత్యేక పథకాలు (Women special schemes 2024): 


భారతీయ మహిళా బ్యాంక్‌ -  మహిళల ఆధ్వర్యంలో నడిచే తయారీ రంగ సంస్థలకు తక్కువ వడ్డీ రేటుకే రూ. 20 కోట్ల వరకు రుణాన్ని అందుబాటులో ఉంచుతోంది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను స్థాపించే మహిళలకు ఎలాంటి తనఖా లేకుండానే కోటి రూపాయల వరకు లోన్‌ అందజేస్తోంది.


అన్నపూర్ణ స్కీమ్‌ - ఆహార సరఫరా (ఫుడ్‌ కేటరింగ్‌) వ్యాపారం పెట్టుకునే మహిళలకు రూ.50 వేల వరకు రుణం లభిస్తుంది. ఈ స్కీమ్‌ కింద వసూలు చేసే వడ్డీ రేటు బ్యాంకును బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతుంది. తీసుకున్న అప్పును మూడేళ్లలో తిరిగి చెల్లించాలి. 


త్రెడ్‌ స్కీమ్‌ - TREAD (Trade-Related Entrepreneurship Assistance and Development) పథకం ద్వారా.. తయారీ, సేవలు, వ్యాపారాలకు కావాల్సిన రుణం, శిక్షణ వంటివి అందిస్తోంది. మొత్తం ప్రాజెక్టు ఖర్చులో 30 శాతం వరకు గ్రాంట్‌ రూపంలో ఇస్తోంది.


వర్కింగ్‌ విమెన్‌ హాస్టల్‌ - ఉద్యోగం చేసే మహిళల కోసం తీసుకొచ్చిన స్పెషల్‌ స్కీమ్‌. మహిళలతో పాటు వారి పిల్లల కోసం కూడా ఈ హాస్టళ్లలో ఏర్పాట్లు ఉంటాయి. నెలవారీ ఆదాయం రూ.50 వేల కంటే తక్కువ ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.


మహిళ శక్తి కేంద్రాలు - 2017లో ప్రారంభమైన పథకం ఇది. మహిళా శక్తి కేంద్రాల్లో చేరిన మహిళలకు నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇచ్చి & ఉపాధి, ఉద్యోగాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తారు.


మహిళా-ఈ-హాత్‌ - దీనిని 2016లో ప్రారంభించారు. ఇదొక మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌. మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక సంఘాలు, లాభాపేక్ష లేని సంస్థలు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు.


ఎస్‌బీఐ స్త్రీ శక్తి స్కీమ్‌ - ఇప్పటికే ఏదైనా వ్యాపారం ఉండి, దానిని విస్తరించాలనుకునే మహిళలకు ఈ పథకం కింద రూ. 50 లక్షల వరకు రుణాన్ని స్టేట్‌ బ్యాంక్‌ (SBI) అందిస్తోంది. రూ.5 లక్షల వరకు ఎలాంటి తనఖా అవసరం లేదు. క్రెడిట్‌ హిస్టరీ, వ్యాపార స్థాయిని బట్టి వడ్డీ రేటు మారుతుంటుంది. ఏడాది నుంచి ఐదేళ్ల లోపు తిరిగి చెల్లించాలి. దరఖాస్తులో చూపిన వ్యాపారంలో మహిళకు కనీసం 50 శాతం వాటా ఉంటేనే ఈ స్కీమ్‌ కింద అప్లై చేసుకోవడానికి అర్హత లభిస్తుంది. 


ఓరియెంట్‌ మహిళా వికాస్‌ యోజన - ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. చిన్న వ్యాపారాలను ప్రారంభించాలనుకునే మహిళలు ఈ స్కీమ్‌ కింద అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. రూ.25 లక్షల వరకు ఎలాంటి తనఖా అవసరం లేని రుణం లభిస్తుంది.


వ్యాపారం చేసే మహిళలకు ఆసరాగా నిలిచే మరికొన్ని పథకాలు: ముద్ర లోన్‌, డేనా శక్తి స్కీమ్‌, మహిళా ఉద్యమ్‌ నిధి యోజన, సెంట్‌ కల్యాణి యోజన, ఉద్యోగిని స్కీమ్‌, ప్రధాన మంత్రి రోజ్‌గార్‌ యోజన, సింధ్‌ మహిళా శక్తి స్కీమ్‌.


మహిళా సమ్మాన్ బచత్‌ పత్ర యోజన  - 2023-24 బడ్జెట్‌లో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ఈ పథకాన్ని ప్రకటించారు. ఇదొక స్వల్పకాలిక పథకం, రెండేళ్ల పాటు పెట్టుబడి పెట్టొచ్చు. వార్షిక ప్రాతిపదికన 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకం రెండేళ్ల FD లాంటిది. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి ఎటువంటి వయోపరిమితిని నిర్ణయించలేదు. పథకం మధ్యలో మీకు డబ్బు అవసరమైనతే పాక్షిక ఉపసంహరణకు కూడా అనుమతి ఉంటుంది.


సుకన్య సమృద్ధి యోజన - బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక పొదుపు పథకం ఇది. ఈ ఖాతాలో పెట్టుబడులపై ప్రస్తుతం 8.20% వడ్డీ లభిస్తోంది. 10 సంవత్సరాల లోపు వయస్సున్న బాలికల కోసం పోస్టాఫీసు లేదా బ్యాంకులో ఖాతా తెరవొచ్చు. ఈ ఖాతాను భారతదేశం అంతటా ఎక్కడికైనా బదిలీ చేయొచ్చు. బాలికకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత పాక్షికంగా, 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పూర్తిగా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.


బ్యాంక్‌ లావాదేవీల్లో ప్రత్యేక ప్రయోజనాలు - మహిళల పొదుపు ఖాతాలపై, సాధారణంగా అందే ప్రయోజనాలతో పాటు బ్యాంక్‌లు ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తున్నాయి. సేవింగ్స్‌ అకౌంట్‌కు అనుసంధానంగా రికరింగ్‌ డిపాజిట్‌, సిప్‌ (SIP) ప్రారంభిస్తే, మహిళల ఖాతాలను ‘మంత్లీ మినిమం బ్యాలెన్స్‌’ నుంచి మినహాయిస్తున్నాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా జూనియర్‌ అకౌంట్‌ తెరిచే అవకాశం కూడా ఇస్తున్నాయి.


వడ్డీ రేటులో డిస్కౌంట్‌ - చాలా బ్యాంకులు, మహిళలకు ఇచ్చే వివిధ రకాల లోన్లపై వడ్డీ రేటును దాదాపు 0.50% వరకు తగ్గిస్తున్నాయి. ముఖ్యంగా గృహ రుణాల్లో ఈ డిస్కౌంట్‌ ఎక్కువగా ఉంటోంది. ఇద్దరు కలిసి రుణం తీసుకున్నా, ప్రధాన రుణగ్రహీతగా మహిళ ఉన్న సందర్భాల్లోనూ వడ్డీ రేటును బ్యాంక్‌లు తగ్గిస్తున్నాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, మహిళల లోన్‌ అప్లికేషన్ల మీద ప్రాసెసింగ్‌ ఫీజును పూర్తిగా రద్దు చేస్తున్నాయి.


తక్కువ బీమా ప్రీమియం - ఇప్పుడు చాలా మంది మహిళలు సంఘటిత/అసంఘటిత రంగాల్లో పని చేస్తున్నారు. కాబట్టి, మహిళలు కూడా ఆరోగ్య/జీవితా బీమా పాలసీలు తీసుకునేలా ఇన్సూరెన్స్‌ కంపెనీలు ప్రోత్సహిస్తున్నాయి. మగవారితో పోలిస్తే తక్కువ ప్రీమియంతో పాలసీలను ఆఫర్‌ చేస్తున్నాయి.


మరో ఆసక్తికర కథనం: రెండు భాగాలుగా విడిపోనున్న `టాటా`- ఎందుకు? ఏమిటి?