Tata Motors news: : `టాటా`(TATA) ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. భారత దేశ(Indian transport field) రవాణా రంగంలో దిగ్గజ కంపెనీ. దేశవ్యాప్తంగా నడుస్తున్న మూడు చక్రాల వాహల నుంచి నాలుగు, ఆరు, 14 చక్రాల వాహనాల వరకు టాటా సంస్థది ఒక బ్రాండ్. 1945 నుంచి ఈ సంస్థ వాహనాల ఉత్పత్తిలో ముందంజలో ఉండడం గమనార్హం. అంతేకాదు.. దేశీయంగా వాహనాల వినియోగం, విక్రయాల్లో టాటా షేర్ 52 శాతం ఉంది. అయితే, ఈ సంస్థ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. టాటా మోటార్స్‌ను రెండుగా విభజించాలని నిర్ణయించింది. టాటా మోటార్స్(TATA motors) దేశంలోని జంషెడ్‌పూర్ , పంత్‌నగర్ , లక్నో , సనంద్ , ధార్వాడ్, పూణే లలో తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. విదేశాల్లో కూడా.. ప్లాంట్లు ఉన్నాయి. ఇక, టాటా షేర్లకు కూడా గిరాకీ ఎక్కువే. టాటా మోటార్స్ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(BSE)లో షార్ట్ లిస్ట్ చేసింది. 2019 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద సంస్థల ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో కంపెనీ 265వ స్థానంలో ఉండడం గమనార్హం. అయితే.. ఇంత పెద్ద నెట్ వర్క్.. వర్క్ ఫోర్స్ ఉన్న కంపెనీ.. రెండుగా విడివడాలని నిర్ణయించడం చర్చగా మారింది.
ఎలా మారుతుంది?
ప్రస్తుతం టాటా మోటార్స్ ప్రస్తుతం ఉమ్మడిగా.. వాణిజ్య(లారీలు, ఆటోలు తదితర), గృహ(కార్లు తదితర) సంబంధిత వాహనాలు సహా ఎలక్ట్రిక్ వాహనాలను సంయుక్తంగా తయారు చేస్తోంది. అయితే.. వీటిని సంయుక్తంగా ఉంచడంతో పర్యవేక్షణ, క్వాలిటీ, వ్యాపారం పెంచుకోవడం, ప్రభుత్వం నుంచి రాయితీలు పొందే విషయంలో కొంత ఇబ్బందులు వస్తున్నాయి. దీనిని గమనించిన టాటా సంస్థ.. ఈ మూడు విభాగాలను రెండుగా విభజించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇటు షేర్ హోల్డర్లతోపాటు.. స్టాక్ ఎక్సేంజీలకు కూడా తెలిపింది. టాటా మోటార్స్ వాటాదారులు అందరికీ ఈ రెండు నమోదిత సంస్థల్లోనూ షేర్లు లభిస్తాయని కంపెనీ తెలిపింది.
ఇవీ విభాగాలు..
1) వాణిజ్య వాహనాల వ్యాపారం(కమర్షియల్), దాని సంబంధిత పెట్టుబడులు.
2) ప్రయాణికుల వాహనాల వ్యాపారం(Passenger) సహా విద్యుత్ వాహనాలు(EV- Electric Vehicles), జేఎల్ఆర్(జాగ్వార్ ల్యాండ్ రోవర్), దానికి సంబంధించిన పెట్టుబడులు
ఏం జరుగుతుంది?
ఇలా కీలకమైన మూడు విభాగాలను రెండు విభాగాలుగా మార్చడంతో స్థిరమైన పనితీరు కనబరిచేందుకు మరింత అవకాశం ఉంటుందని టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. డీమెర్జర్ ద్వారా మార్కెట్లో ఉన్న అవకాశాల్ని ఒడిసి పట్టుకునేందుకు చాన్స్ లభిస్తుందన్నారు. ఆయా విభాగాల్లో మరింత ఎక్కువ పర్యవేక్షణకు కూడా అవకాశం ఉంటుందన్నారు. అంతేకాదు.. టాటా మోటార్స్ విభజన విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదని పేర్కొన్నారు. ఉద్యోగులు, కస్టమర్లు, మా వ్యాపార భాగస్వాములపై ఎలాంటి ప్రభావం పడదని చంద్రశేఖరన్ వివరించారు. అయితే.. స్టేక్ హోల్డర్లకు, నియంత్రణ సంస్థలకు అనుమతులు వచ్చేందుకు దాదాపు ఏడాదికిపైగానే సమయం పడుతుందన్నారు.
షేర్ మార్కెట్‌లో..
టాటా కంపెనీ విభజన ప్రకటన వెలువడడంతో షేర్ మార్కెట్‌లో కంపెనీ లాభాల పంట పండించింది. షేరు స్వల్పంగా పుంజుకొని రూ. 988.90 వద్ద స్థిరపడింది. ఒక దశలో 52 వారాల గరిష్టాన్ని కూడా నమోదు చేసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.3.62 లక్షల కోట్లుగా ఉండగా, టాటా సంస్థ ప్రకటన నేపథ్యంలో షేర్లు పుంజుకోవడం గమనార్హం. ఇక, జరుగుతున్న మార్పుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో ఇప్పటికే 30 వరకు సంస్థలు లిస్ట్ కాగా.. రానున్న రెండేళ్లలో ఈ సంఖ్య 35కు చేరుకునే అవకావం ఉంది.
విఫలమైంది ఇదొక్కటే!
టాటా కంపెనీ నుంచి వచ్చిన అన్ని వాహనాలు దాదాపు ప్రజల ఆదరణను చూరగొన్నాయి. అయితే.. 2009లో వచ్చిన `టాటా నానో` కారు మాత్రం విఫలమైంది. ఇది ప్రధానంగా దిగువ మధ్యతరగతి వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తీసుకువచ్చారు. ప్రారంభంలో కేవలం లక్ష రూపాయలకే ఈ వాహనాన్ని అందించారు. తర్వాత స్వల్పంగా పెంచారు. అయితే.. భద్రత పరంగా, సౌకర్యాల పరంగా ఇది వాహనదారుల మనసును దోచుకోలేక పోయింది. దీంతో 2018లో, టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ `టాటా నానో`ను విఫలమైన ప్రాజెక్ట్‌గా పేర్కొన్నారు. దీని ఉత్పత్తి మే 2018లో నిలిచిపోయింది.