Tamilnadu DMK: తమిళనాడులో భాషా రాజకీయం అంతకంతకూ కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం బడ్జెట్ కాపీపై రూపీ సింబల్‌ను తొలగించింది. బడ్జెట్ కాపీపై హిందీ రూపీ సింబల్ బదులు తమిళంలో రూపాయి సింబల్‌ను ప్రింట్ చేసింది. తమిళ సింబల్ ఉన్న బడ్జెట్ ప్రతులను.. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. త్రిభాషా విధానంలో తమిళనాడు సర్కారు మాత్రం హిందీ భాషను మూడవ భాషగా తమ విద్యార్థులుక నేర్పేందుకు వ్యతిరేకిస్తోంది. అయితే సింబల్‌ను మార్చిన అంశంపై ఇప్పటి వరకు తమిళనాడు సర్కారు ఎటువంటి ప్రకటన చేయలేదు. హిందీ అక్షరంతో పోలిన రూపాయి కావడంతో తీసేసినట్లుగా తెలుస్తోంది.
తమిళనాడు ప్రభుత్వ వ్యవహారంపై బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు అన్నామలై మండిపడ్డారు. రూపాయి సింబల్ ను డిజైన్ చేసింది తమిళియన్ అని గుర్తు చేశారు. ఉదయ్ కుమార్ అనే తమిళ వ్యక్తి డిజైన్ చేసిన రూపాయిని కాదని.. ఇలాంటి స్టుపిడ్ నిర్ణయాలు ఎలా తీసుకుంటారని అన్నామలై ప్రశ్నించారు.
రూపాయి సింబల్ తమిళనాడుకు చెందిన వ్యక్తే రూపొందించారు. డాలర్ కు ఉన్నట్లుగానే రూపాయికి ఓ ప్రత్యేక సింబల్ ను తమిళనాడుకు చెందిన ఉదయ్ కుమార్ డిజైన్ చేశారు. ఆయన రూపొందించిన సింబలే ప్రపంచవ్యాప్తంగా భారత రూపాయికి సింబల్ గా మారింది. ఇప్పుడు స్టాలిన్ తమిళుల్ని అవమానపరుస్తున్నారని కొంత మంది ఘాటు విమర్శలు చేస్తున్నారు.
భాషా రాజకీయాలతో చివరికి సింబల్స్ ను కూడా మార్చేస్తున్నారని.. సెంటిమెంట్ రాజకీయాల కోసం డీఎంకే ప్రతీ దాన్ని వివాదం చేస్తోందని తమిళనాడులో విమర్శలు గుప్పుమంటున్నాయి.