Maharashtra Election Results 2024: యూపీలోనే కాకుండా మహారాష్ట్రలోనూ NDA కూటమి వెనకబడింది. థాక్రే, శరద్ పవార్ పార్టీలను చీల్చినప్పటికీ బీజేపీకి పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. పైగా థాక్రే శివసేన, శరద్ పవార్ NCP తో కూడిన ఇండియా కూటమి 30 చోట్ల విజయం సాధించింది. NDA 17 స్థానాలకే పరిమితమైంది. మళ్లీ ఇక్కడ మహా వికాస్ అఘాడాకి టైమ్ వచ్చిందన్న విశ్లేషణలూ మొదలయ్యాయి. సరిగ్గా ఇదే సమయంలో మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ తెరపైకి వచ్చారు. NDA ఓటమికి బాధ్యత వహిస్తున్నానని వెల్లడించారు. అంతే కాదు. తన డిప్యుటీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. వచ్చే ఏడాది మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వెనకబడడం NDAకి ఇబ్బందికరంగా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెడతానని ఫడణవీస్ వెల్లడించారు.
"మహారాష్ట్రలో వచ్చిన ఫలితాలకు పూర్తి నైతిక బాధ్యత నాదే. నేనే ఇక్కడ పార్టీ బాధ్యతలను చూసుకున్నాను. ఇకపై డిప్యుటీ సీఎం పదవిలో కొనసాగలేను. రాజీనామా చేయాలనుకుంటున్నాను. దయచేసి హైకమాండ్ నా రాజీనామాను ఆమోదించాలని కోరుతున్నాను. ఈ బాధ్యతల నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం కష్టపడతాను"
- దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర డిప్యుటీ సీఎం
వచ్చే ఏడాది నవంబర్‌లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. లోపాలపై చర్చలు జరిగాయి. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోల్చి చూస్తే 14 స్థానాలు కోల్పోయింది బీజేపీ.