Mirchi crop in vinukonda: పల్నాడు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. పంటలు ధ్వంసం చేసుకునే వరకు వచ్చాయి. వినుకొండ (Vinukonda) మండలం  నడిగడ్డ(Nadigadda) గ్రామంలో టీడీపీ మద్దతు దారులకు చెందిన మిరప పంటను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పంట పొలాల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాలు  పాతారు. దీంతో పంట నాశనం చేసింది వైఎస్‌ఆర్‌సీపీ వాళ్లే అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు బాధిత రైతులు. ధ్వంసమైన మిరప పంటను చూసుకుని  బోరుమంటున్నారు. రాజకీయాల కారణంగా పంటలను నాశనం చేశారని ఆరోపిస్తున్నారు. 


అసలు ఏం జరిగిందంటే...?
వినుకొండ మండలం నడిగడ్డకు చెందిన వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యకర్త. వెంకటేశ్వర్లు మూడెకరాల్లో మిర్చి పంట సాగు చేశాడు. అయితే...వెంకటేశ్వర్లు సాగు  చేసిన ఆ మిర్చి పంటను దుండగులు ధ్వంసం చేశారు. రోజూ లాగే... ఈనెల 18వ తేదీ (సోమవారం) ఉదయం పొలానికి వెళ్లాడు వెంకటేశ్వర్లు. అక్కడ... అర ఎకరం విస్తీర్ణంలో  మొక్కలు పీకేసి ఉన్నారు. అంతేకాదు... మిరప మొక్కలను (Mirchi Crop) పీకేసిన దుండగులు... పొలంలో వైసీపీ జెండాలు పాతారు. దీంతో బాధితులు అది వైఎస్ఆర్‌సీపీ  పనే అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తరుపున పనిచేస్తున్నాడనే కారణంతో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఇబ్బంది  పెడుతున్నారని గ్రామస్తులు కూడా చెప్తున్నారు. 


మిరప పంట వేసిన భూమికి సంబంధించి ఎలాంటి వివాదాలు లేవని అంటోంది బాధిత రైతు కుటుంబం. పనిగట్టుకుని పంటను ధ్వంసం చేయాల్సినంత గొడవలు తమకు  లేమని చెప్తున్నారు. ఇది రాజకీయ కక్షతో చేసిన పనే అని చెప్తున్నారు. పొలిటికల్‌గా కక్ష కట్టి తమ కుటుంబాన్ని సమస్యల్లో ఇరికిస్తున్నారని వాపోయారు. మిరప పంటను  ధ్వంసం చేసిన దుండగులు చేతులకు గ్లౌజులు వేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ గ్లౌజుల్ని కూడా పొలంలోనే పడేశారు. అంతేకాదు పొలంలో మద్యం సీసాలు కూడా కనిపించాయి.  పొలంలో తప్పతాగి... పంటను ఆశనం చేశారని బాధితులు మండిపడుతున్నారు. పంట చేతికందే సమయంలో నాశనం చేశారంటూ వెంకటేశ్వర్లు భార్య పొలంతోనే కన్నీళ్లు  పెట్టుకుంది. మట్టి కొట్టుకు పోతారు రా దుర్మార్గులరా అంటూ పంటను నాశనం చేసిన వాళ్లకు శాపనార్థాలు పెట్టింది. మరోవైపు... మిరప పంటను ధ్వంసం చేసినా.. పోలీసులు  కనీసం కేసు కూడా నమోదు చేయడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. 


పొలంలో పీకి పారేసిన మిరప పంటను చేతిలో పట్టుకుని... మహిళా రైతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆమె బాధ చూసి స్థానికులు కూడా చలించిపోయారు. ఇదేం అరాచకం అంటూ.. బాధితుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. రాజకీయ క్షక్షలు ఉంటే మరోలా చూసుకోవాలని గానీ.. పంటలపై చూపిస్తారా అంటూ బాధిత కుటుంబం మండిపడుతోంది. చేతికొచ్చిన పంటను నాశనం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి... బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధిత రైతు. మిరప పంటను ధ్వంసం చేసి.. వైఎస్‌ఆర్‌సీపీ జెండాలు పాతింది ఎవరో గుర్తించాలని వేడుకుంటున్నారు. మరోసారి ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.