Hyderabad News: హైదరాబాద్ లో గతేడాది నిర్వహించిన ఫార్ములా ఈ రేసింగ్ ఒప్పందానికి సంబంధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శలు చేశారు. ఆ ఈవెంట్ అనేది ఓ కంపెనీకి లబ్ధి చేకూర్చడం కోసమే పెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని పచ్చిగా అమ్మకానికి పెట్టిందని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫార్ములా రేసుతో రాష్ట్రానికి వచ్చే లాభం ఏమీ లేదని ప్రశ్నించారు. మంగళవారం (జనవరి 9) భట్టి విక్రమార్క సచివాలయంలో ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ కంపెనీకి లబ్ధి చేయడం కోసమే ఫార్ములా రేసు నిర్వహించారని.. దాన్ని వ్యాపార సూత్రాలకు విరుద్ధంగా నిర్వహించారని ఆరోపించారు. ఈ రేసుకు రూ.110 కోట్లు కట్టారని.. ఇప్పుడు తాము ఫార్ముల ఈ-రేసు రద్దు చేయడంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని భట్టి విక్రమార్క అన్నారు. 


ఫార్ములా ఈ రేసింగ్ రద్దు కావడంపై మాజీ మంత్రుల వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయని..  ప్రతిపైసా ప్రజల అవసరాల కోసం మాత్రమే తాము ఖర్చు చేస్తామని వివరించారు. గత ప్రభుత్వ తప్పిదాలను తాము కచ్చితంగా సరిచేస్తామని అన్నారు. తప్పుడు ప్రచారం చేస్తే కఠన చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క హెచ్చరించారు.


సెక్రటరియేట్ బిజినెస్ రూల్స్ ప్రకారం ఫార్ములా ఈ-రేస్‌కు అనుమతి లేదని భట్టి విక్రమార్క అన్నారు. వాళ్లు ఎవరో హైదరాబాద్‌కు వచ్చి వెళ్లడానికి రూ.100 కోట్లు కట్టాలా? అని ప్రశ్నించారు. ఇది బిజినెస్ రూల్స్‌కు విరుద్ధమైనదని భట్టి అన్నారు. ప్రతి పైసా రాష్ట్ర ప్రజల అవసరాల కోసం ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహించడం వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం ఉండదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారం ప్రభుత్వం ట్రాక్​ సదుపాయం కల్పించాలని అన్నారు. గత ప్రభుత్వం ట్రై పార్టీ ఒప్పందాన్ని బై పార్టీ అగ్రిమెంట్ ​గా మార్చిందని భట్టి ధ్వజమెత్తారు. ఫార్ములా ఈ రేస్ ​కు సంబంధించి ప్రభుత్వం రూ.110 కోట్లు చెల్లించాలని, ఈ రేస్ ​కు డబ్బులు చెల్లించి అనుమతులు ఇప్పించాలని ఒప్పందంలో ఉందని తెలిపారు.


ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌కు నోటీసులు


ఈ రేసింగ్ ఈవెంట్ కు సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం విచారణ చేస్తోంది. 2023 ఫిబ్రవరిలో అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ప్రత్యేక ఏర్పాట్లతో ఫార్ములా - ఈ రేసింగ్ నిర్వహించింది. ఈ వ్యవహారంలోనే ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మంళవారం (జనవరి 9) మెమో జారీ చేసింది. ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన అప్పుడు కుదిరిన కాంట్రాక్టులోని కొన్ని అంశాలపై పూర్తిగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆ మెమోలో కోరింది. ఫార్ములా-ఈతో త్రైపాక్షిక లాంగ్ ఫోరమ్ ఒప్పందం ఎందుకు నమోదు చేశారో తెలపాలని వివరణ అడిగింది. ప్రభుత్వ అనుమతి లేకుండా రూ.54 కోట్లను హెచ్‌ఎండీఏ నుంచి ఫార్ములా ఈ రేసుకు బదిలీ చేశారనే ఆరోపణలు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై ఉన్నాయి.