Rahul Gandhi:


ఢిల్లీ పోలీసుల విచారణ..


ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసానికి పోలీసులు వెళ్లారు. స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హెడ్ సాగర్ ప్రీత్ హుడా బృందం ప్రస్తుతం ఆయన ఇంటికి చేరుకుంది. భారత్ జోడో యాత్ర శ్రీనగర్‌లో ముగిసిన సందర్భంగా రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లో ఇప్పటికీ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, ఆ బాధితులు తనతో బాధ పంచుకున్నారని అన్నారు. దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఏ ఆధారాలతో ఈ వ్యాఖ్యలు చేశారో చెప్పాలంటూ బీజేపీ కూడా తీవ్రంగా మండి పడింది. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసులు రాహుల్‌ను విచారించేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. ఆ బాధితుల వివరాలు ఇస్తే వారికి న్యాయం జరిగేలా చూస్తామని చె చెబుతున్నారు. 


"మేమిక్కడి రాహుల్‌ గాంధీతో మాట్లాడేందుకు వచ్చాం. ఈ ఏడాది జనవరి 30న రాహుల్ గాంధీ శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొందరు మహిళలకు అత్యాచారానికి గురయ్యారని, స్వయంగా ఆ బాధితులే తనతో మాట్లాడారని చెప్పారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు వచ్చాం. తద్వారా బాధితులకు న్యాయం చేయాలని భావిస్తున్నాం"


-సాగర్ ప్రీత్ హుడా, స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హెడ్ 






రాహుల్ శ్రీనగర్‌లో మాట్లాడిన ప్రతి మాటనూ రికార్డ్ చేసుకున్న పోలీసులు...ఆ ఆధారంగానే ఆయనను ప్రశ్నించనున్నారు. అంతే కాదు. కశ్మీర్‌లో మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి మీడియా చూపించడం లేదని ఆరోపించడమూ వివాదాస్పదమైంది. 


"మహిళలు ఇంకా వేధింపులకు గురవుతూనే ఉన్నారు. కానీ మీడియా మాత్రం వీటి గురించి మాట్లాడదు. ఆ వార్తలు చూపించదు. ఇద్దరు మహిళలు నాతో వ్యక్తిగతంగా మాట్లాడారు. తాము గ్యాంగ్‌ రేప్‌నకు గురైనట్టు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చాను. కానీ వాళ్లు తమకు పెళ్లి అవ్వదేమో అన్న భయంతో ముందుకు రాలేదు"


- శ్రీనగర్‌లోని స్పీచ్‌లో రాహుల్ గాంధీ


ఈ వ్యాఖ్యల ఆధారంగానే రాహుల్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన సోషల్ మీడియా అకౌంట్‌లలో చేసిన పోస్ట్‌లనూ పరిశీలించారు. అయితే...ఈ నోటీసులపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మండి పడ్డారు. యాత్ర ముగిసిన 45 రోజుల తరవాత విచారించాలని గుర్తొచ్చిందా అని విమర్శించారు. లీగల్‌గా ప్రొసీడ్ అవుతామని తేల్చి చెప్పారు.