Delhi Govt On Firecrackers: 


కాలుష్యం కట్టడి చేసేందుకే..


దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఆప్ సర్కార్. వచ్చే ఏడాది జనవరి వరకూ బాణసంచా కాల్చడంపై నిషేధం విధించింది. ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్‌ ఈ విషయం వెల్లడించారు. "ఢిల్లీ ప్రజల్ని కాలుష్య ముప్పు నుంచి తప్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం" అని ఆయన స్పష్టం చేశారు. బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయాలు..అన్నింటిపైనా నిషేధం వర్తిస్తుంది. ఇలా కట్టడి చేయటం ద్వారా కాలుష్యాన్ని చాలా వరకూ కంట్రోల్ చేయొచ్చని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. 2023 జనవరి 1 వ తేదీ వరకూ ఈ నిషేధం అమలవుతుంది. ఆన్‌లైన్‌లోనూ క్రాకర్స్‌ను కొనుగోలు చేయటానికి వీల్లేదు. ఢిల్లీ పోలీసులు దీనికి సంబంధించి ప్లాన్ రెడీ చేస్తున్నట్టు గోపాల్ రాయ్ చెప్పారు. రానున్న నెలల్లో దసరా, దీపావళి పండుగలున్నాయి. ఆ సమయంలో పెద్ద మొత్తంలో బాణాసంచా కాల్చుతారు. ఇది దృష్టిలో ఉంచుకుని..ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏటా ఢిల్లీ అక్టోబర్, నవంబర్ నెలల్లో కాలుష్య మేఘాలు కమ్మేస్తుంటాయి. ఆ సమయంలోనే బాణాసంచా కాల్చటం వల్ల సమస్య మరీ తీవ్రమవుతోంది. ఇది కాకుండా..పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్‌లో గడ్డికాల్చటమూ కాలుష్యం అధికమవటానికి కారణమవుతోంది. ఎయిర్ క్వాలటీ ఇండెక్స్‌లో గాలి నాణ్యత
దారుణంగా పడిపోతోంది. గతేడాది సెప్టెంబర్‌లోనూ ఢిల్లీలో బాణాసంచాపై నిషేధం విధించారు. సైలెంట్ జోన్స్‌ అని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి...ఆ ప్రాంతాల్లో బాణాసంచా కాల్చిన వారికి రూ.20,000 జరిమానా విధించారు. 




కొత్త ప్లాన్‌తో రెడీ..


దేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం (Delhi Air Pollution) గురించి ప్రస్తావన వస్తే, దిల్లీ సిటీ పేరు తప్పకుండా వినిపిస్తుంది. అంతర్జాతీయంగా అత్యంత కలుషిత నగరాల జాబితాలో దిల్లీ ఎప్పటి నుంచో ఉంది. ఎన్నో నివేదికలు ఇదే విషయాన్ని వెల్లడించాయి. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య ఉన్నా..ఇప్పుడిప్పుడే పరిష్కరించేందుకు రకరకాల మార్గాలు వెతుక్కుంటోంది ప్రభుత్వం. రానున్న చలికాలంలో దిల్లీ వాసులకు ఇబ్బందులు తప్పించేందుకు కొత్త ప్లాన్‌తో సిద్ధమవుతోంది. ది కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్-CAQM..గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌- GRAP అమలు చేసేందుకు రెడీ అవుతోంది. కాలుష్యాన్ని కట్టడి చేయడమే కాకుండా, ప్రజలపై తీవ్ర ప్రభావం పడకుండా ఉండేందుకు ఈప్రణాళికలు తోడ్పడతాయని అంటోంది అక్కడి ప్రభుత్వం. 2017లోనే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ..ఈ గ్రేడెడె రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని సూచించింది. అక్టోబర్ మధ్య నుంచి ఎప్పుడైతే కాలుష్యం ఎక్కువవుతోందో అప్పుడు ఈ ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ GRAPని నాలుగు భాగాలుగా విభజించారు. 


ఆంక్షలతో..


వాయు నాణ్యత ఆధారంగా స్టేజ్‌లను నిర్ధరిస్తారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 201-300 మధ్యలో ఉంటే స్టేజ్‌ 1గా, 301-400గా ఇంటే స్టేజ్‌2గా పరిగణిస్తారు. 401-450 వరకూ స్టేజ్‌-3 కాగా, 450 కి మించి AQI ఉంటే అత్యంత ప్రమాదకమైన స్టేజ్‌ 4గా నిర్ధరిస్తారు. బొగ్గుతో పాటు, 
రెస్టారెంట్‌లు,హోటల్‌లో తందూర్స్‌నూ వినియోగించేందుకు వీల్లేకుండా ఆంక్షలు విధిస్తారు. డీజిల్ జనరేటర్ సెట్స్‌ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. స్టేజ్‌ 3 వరకూ తీవ్రత చేరుకుంటే,  వెంటనే ఎన్‌సీఆర్, దిల్లీ పరిధిలోని నిర్మాణాలను ఆపేస్తారు. అత్యవసర ప్రాజెక్ట్‌లు తప్ప మిగతా అన్ని నిర్మాణాలపైనా ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ప్లంబింగ్, కార్పెంటరీ, ఇంటీరియర్ డెకరేషన్ లాంటివి మాత్రం చేసుకోవచ్చు. స్టోన్ క్రషర్స్, ఇటుక బట్టీలపైనా నిషేధం విధిస్తారు. అంతే కాదు. బీఎస్-3, బీఎస్-4  వాహనాలూ రోడ్డుపైకి రాకుండా ఆంక్షలు విధిస్తారు. ఇక స్టేజ్‌ 4లో ట్రక్స్, గూడ్స్ వాహనాలు తిరగకుండా నిషేధిస్తారు. 


Also Read: Nitin Gadkari: సైరస్ మిస్త్రీ ప్రమాదంతో అలెర్ట్ అయిన కేంద్రం - ఇక నుంచి అన్ని వాహనాలకు అది తప్పనిసరి