Arvind Kejriwal In Gujarat: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ 'ఖతం' అయిందని.. ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పోటీ చేస్తుందని కేజ్రీవాల్ అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి గుజరాత్‌లో ప్రకటనలు ఇస్తోందని కాంగ్రెస్ ఇటీవల ఆరోపించింది. కాంగ్రెస్ చేసిన ఈ ఆరోపణలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కేజ్రీవాల్ ఇలా బదులిచ్చారు.
కేజ్రీవాల్ నయా జోష్
దిల్లీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన అరవింద్ కేజ్రీవాల్ నేడు ప్రాంతీయ రాజకీయాలను వదిలి జాతీయ స్థాయిలో తమ పార్టీ విశ్వసనీయతను పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారు. కేజ్రీవాల్ రెండోసారి దిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న తర్వాత హరియాణా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
అందుకు తగ్గట్లుగానే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దిల్లీ తర్వాత పంజాబ్‌లో విజయం సాధించింది. పంజాబ్ విజయంతో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ ఫుల్ జోష్‌లో ఉంది.
ఈ ఏడాది చివర్లో జరగనున్న హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా తీసుకున్నారు. అందుకే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ భాజపా ప్రభుత్వం ఉంది. తన వ్యూహాన్ని మార్చుకుంటూనే, అరవింద్ కేజ్రీవాల్.. భాజపాకు కంచుకోటగా చెప్పుకునే గుజరాత్‌లో పాగా వేయాలని సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇందుకోసం గుజరాత్‌లో కేజ్రీవాల్ వరుస ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
భారీ వాగ్దానాలు
దిల్లీ, పంజాబ్ లాగే గుజరాత్‌కు కూడా కేజ్రీవాల్ ఎన్నో హామీలు ప్రకటించారు.
- 2 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీ,
- రైతులకు పగటిపూట విద్యుత్ సరఫరా,
- 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,
- 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు
ఇలా అనేక హామీలను కేజ్రీవాల్.. గుజరాత్ ప్రజలకు ఇచ్చారు. 182 మంది సభ్యుల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు 29 మంది అభ్యర్థులతో కూడిన మూడు జాబితాలను ఆయన పార్టీ ఇప్పటికే విడుదల చేసింది.
Also Read: Bharat Jodo Yatra: జోడో యాత్రలో జోష్ నింపిన రాహుల్ గాంధీ- తగ్గేదేలే!