అనుమతి ఎందుకు ఇవ్వరు..? : కేజ్రీవాల్


తన సింగపూర్ విజిట్‌కు క్లియరెన్స్ ఇవ్వకపోవటంపై కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు దిల్లీ ముఖ్యంత్రి అరవింద్ కేజ్రీవాల్. "నేను క్రిమినల్‌ను కాదు" అంటూ ఘాటుగా స్పందించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన తరవాత మీడియాతో మాట్లాడిన సందర్భంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. "నేనేమీ నేరస్థుడిని కాదు. నేనో రాష్ట్రానికి మఖ్యమంత్రిని. స్వాతంత్ర్య భారత పౌరుడిని. నన్నెందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు..? దిల్లీ మోడల్‌ గురించి తెలుసుకునేందుకు ఓ సమ్మిట్‌కు స్వయంగా సింగపూర్ ప్రభుత్వమే నన్ను ఆహ్వానించింది" అని అన్నారు కేజ్రీవాల్. తనను అడ్డుకోవటం వెనక రాజకీయ కారణాలున్నాయని ఆరోపించారు. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది ప్రతినిధులు వస్తారని, దిల్లీ మోడల్ గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు ఇదో అరుదైన అవకాశమని అన్నారు. డొనాల్డ్ ట్రంప్ సతీమణి దిల్లూ స్కూల్‌కు వచ్చారని, నార్వే మాజీ ప్రధాని కూడా మొహల్లా క్లినిక్‌ల గురించి ఆరా తీశారని గుర్తు చేశారు. కేంద్రం ఇలాంటి పనులు మానుకోవాలని డిమాండ్ చేశారు. నెల రోజులుగా సింగపూర్ విజిట్‌కు కావాల్సిన అనుమతి కోసం ఎదురు చూస్తున్నానని ప్రధాని మోదీకి లేఖ రాశారు కేజ్రీవాల్. ఆగస్ట్ మొదటి వారంలో జరగనున్న ఈ సమ్మిట్‌కు అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఆహ్వానం అందింది.





 


అది మేయర్ల కోసం జరిపే సమ్మిట్: భాజపా నేత


అయితే ఈ వివాదంపై భాజపా నేత అమిత్ మాలవియా స్పందించారు. సింగపూర్‌లో జరిగే సమ్మిట్, మేయర్ల కోసమని, దిల్లీకి సీఎం అయిన కేజ్రీవాల్ ఈ సదస్సుకి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో అర్థం కావట్లేదని ట్వీట్ చేశారు. ఆయనో సీఎం అనే విషయాన్ని కేజ్రీవాల్‌కు గుర్తు చేయాలంటూసెటైర్లు వేశారు. సూరత్ మేయర్‌కు కూడా సింగపూర్ సమ్మిట్‌కు ఆహ్వానం అందిందని వెల్లడించారు.