Delhi Air Pollution:


కాలుష్యం కారణంగా..


ఢిల్లీలో రేపట్నుంచి ప్రైమరీ స్కూల్స్‌ను మూసివేయనున్నారు. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో...ఈ నిర్ణయం తీసుకుంది ఆప్ సర్కార్. పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ మరో కీలక ప్రకటన కూడా చేశారు. దాదాపు 50% ప్రభుత్వ ఉద్యోగులు ఇంటినుంచే పని చేస్తారని స్పష్టం చేశారు. ప్రైవేట్ స్కూల్స్ కూడా విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసెస్ నిర్వహించే ఆలోచన చేయాలని సూచించారు. బీఎస్-6 వాహనాలకు తప్ప మిగతా వెహికిల్స్ రోడ్‌పైన తిరిగేందుకు అనుమతి లేదని వెల్లడించారు. కేవలం డీజిల్‌తో నడిచే లైట్ మోటార్ వెహికిల్స్‌కు పర్మిషన్ ఉంటుంది చెప్పారు. "పర్యావరణ్ బస్ సర్వీస్‌"లో భాగంగా 500 ప్రైవేట్ సీఎన్‌జీ బస్‌లను నడుపుతున్నట్టు తెలిపారు. ప్రజలు సొంత వాహనాలు పక్కన పెట్టి ఈ ప్రజా రవాణాను వినియోగించాలని సూచించారు. మార్కెట్‌లు, ఆఫీస్‌లు ఎప్పటి వరకూ తెరిచి ఉండాలన్నది రెవెన్యూ కమిషనర్లు నిర్ణయిస్తారని అన్నారు. ఢిల్లీలోని హాట్‌స్పాట్‌ల వద్ద స్పెషల్ టాస్క్‌ ఫోర్స్‌లను నియమించి కాలుష్య కట్టడికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రమాదకరమైన PM 2.5 కాలుష్యానికి...పంజాబ్‌లో రైతులు గడ్డి కాల్చటమే కారణమని అధికారులు తెలిపారు. ఈ కారణంగానే...దేశ రాజధానిలో 34% మేర కాలుష్యం నమోదవుతోందని పేర్కొన్నారు. పంజాబ్ రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు గోపాల్ రాయ్. లక్షా 20 వేల మెషీన్లతో గడ్డిని పంట పొలాల్లో నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. గడ్డి కాల్చటాన్ని నిలువరించాలని పంచాయతీలు కూడా తీర్మానించినట్టు చెప్పారు. వచ్చే ఏడాది నవంబర్ నాటికి ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని గోపాల్ రాయ్ హామీ ఇచ్చారు. 


భాజపా వర్సెస్ ఆప్..


పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించలేకపోతోందని భాజపా ఫైర్ అవుతోంది. ఈ క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయిందని వెల్లడించారు. పంజాబ్‌లో గడ్డి కాల్చుతుండటాన్ని ప్రస్తావించారు. "పంజాబ్‌లో జరుగుతున్న దానికి పూర్తి స్థాయి బాధ్యత వహిస్తాం. మేము అధికారంలోకి వచ్చి కేవలం 6 నెలలు అవుతోంది. ఇప్పటి వరకూ ఎన్నో కట్టడి చర్యలు తీసుకున్నాం. వచ్చే ఏడాది నాటికి రైతులు అలా గడ్డికాల్చకుండా జాగ్రత్తపడతాం" అని హామీ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే పంజాబ్‌లో శాంతి భద్రతలు అదుపులోకి వస్తున్నాయని, మిగతా సమస్యలు పరిష్కరించడానికి ఇంకాస్త సమయం ఇవ్వాలని చెప్పారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు. "కేంద్ర ప్రభుత్వం మాకు సహకరిస్తే కలిసి కట్టుగా ఈ కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు వీలవుతుంది" అని స్పష్టం చేశారు. కేవలం తమ వైపే వేలెత్తి చూపించటం సరికాదని వెల్లడించారు. "ఢిల్లీలో కాలుష్య స్థాయి ప్రమాదకరంగా మారటానికి మా ప్రభుత్వం మాత్రమే కారణం కాదు" అని వెల్లడించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా దీనిపై స్పందించారు. రైతులు పూర్తి స్థాయిలో వరిపైనే ఆధారపడకుండా విభిన్న పంటలు సాగు చేసేలా ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.


Also Read: Morbi Bridge Collapse: మోర్బి ఘటన బాధ్యులపై మొదలైన చర్యలు, ఆ అధికారిపై సస్పెన్షన్ వేటు