Pakistan New Army Chief:
ఆర్మీ చీఫ్ ఎన్నికపై మేధోమథనం..
నెల రోజులుగా పాకిస్థాన్ రాజకీయాల్లో చాలానే మార్పులు కనిపిస్తున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరగడం, ఇదంతా సైన్యం పనే అని ఆయన ఆరోపించడం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా త్వరలోనే రిటైర్ అవుతుండటమూ మరో ఆసక్తికర పరిణామానికి దారి తీయనుంది. నవంబర్ 29 తరవాత కొత్త జనరల్ చేతుల్లోకి వెళ్లిపోతుంది పాక్ సైన్యం. అయితే...ఈ పదవి ఎవరికి అప్పగిస్తారన్న విషయమూ రాజకీయమవుతోంది. తదుపరి ఆర్మీ చీఫ్ జనరల్...పాక్ భవితవ్యాన్ని మార్చేస్తారన్న అంచనాలతో ఉన్నారంతా. ఈ విషయంలో ప్రభుత్వం తప్పు చేస్తే...అది సరిదిద్దుకోటానికి సమయం, అవకాశం రెండూ లేవు. అందుకే...ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ పదవికి అర్హులైన వారి జాబితాలో ఆరుగురి పేర్లున్నాయి. ఇప్పటికే ఈ లిస్ట్‌ను దగ్గర పెట్టుకుని ఎవరిని ఎంపిక చేసుకోవాలనే మథన పడుతున్నారు షెహబాజ్. మరో రెండు రోజుల్లో ఎప్పుడైనా ప్రకటన రావచ్చు. మరో ఆర్మీ లెఫ్ట్‌నెంట్ జనరల్ పదవీ కాలం కూడా త్వరలోనే ముగియనుంది.
అంటే...దేశ రక్షణలో కీలకమై సైన్యంలో రెండు అత్యున్నతమైన పదవుల్లో బాధ్యతాయుతమైన, సమర్థమంతమైన వ్యక్తుల్ని నియమించు కోవాల్సిన అవసరం ఏర్పడింది. క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని...అన్నీ ఆలోచించుకుని అప్పుడే ప్రకటన చేయాలనుకుంటున్నారు షెహబాజ్ షరీఫ్. ప్రధాని ఎంపిక చేసిన తరవాత...ఆ ప్రతిపాదనను రాష్ట్రపతి ముందుంచాలి. సమస్యంతా ఇక్కడే వచ్చేలా ఉంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవలే ఓ సంచలన విషయం చెప్పారు. ఆర్మీ చీఫ్ జనరల్‌ను ఎన్నుకునే విషయంలో రాష్ట్రపతి తప్పకుండా తమను సంప్రదిస్తారని చెప్పారు. ఇదే ప్రధాని షెహబాజ్‌కు తలనొప్పి తెచ్చి పెడుతోంది. పైకి "ఎవరు ఆర్మీ చీఫ్ అయినా పరవాలేదు" అని ఇమ్రాన్ చెబుతున్నా...ఈ ఎన్నిక విషయంలో కచ్చితంగా కలగజేసుకుని సమస్యలు సృష్టిస్తారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు షెహబాజ్. ఆర్మీ చీఫ్ అపాయింట్‌మెంట్‌ను అడ్డుకునే హక్కు రాష్ట్రపతికి లేకపోయినా...ఆమోదించడంలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యమైతే చేసే అవకాశముంది.
ఇమ్రాన్ ధీమా..
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. లాహోర్‌లోని ఓ సభకు హాజరైన ఇమ్రాన్...ఎన్నికలు జరుపుతున్న తీరునీ ప్రస్తావించారు. పాకిస్థాన్‌లోని ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని తీర్చే ఒకే ఒక పరిష్కారం...పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం అని తేల్చి చెప్పారు. దేశంలో సుస్థిరత తీసుకొచ్చి, ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెంచాలన్నా...ఎన్నికలు నిర్వహించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. "ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికలను ఎంత ఆలస్యం చేస్తే...మా పీటీఐ పార్టీకి అంత ప్రయోజనం కలుగుతుంది. మేము ప్రచారం చేయాల్సిన పని లేకుండానే అధికారంలోకి వచ్చేస్తాం" అని చెప్పారు. దేశ స్థితిగతులు మార్చే సమర్థమైన నిర్ణయాలు తీసుకోవాలంటే...భారీ మెజార్టీ సాధించాలని అన్నారు. "దేశాన్ని సరైన దిశలో నడిపించాలంటే...కొత్త ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది" అని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇంకెన్నో చర్యలు చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు.
Also Read: Viral News: మార్నింగ్ వాక్ కలిపింది ఇద్దరినీ- 70 ఏళ్ల వృద్ధుడిని పెళ్లాడిన యువతి!